Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పట్టు కొరత నివారణకు ఆప్కో సిల్క్ పార్కులు: చిల్లపల్లి

పట్టు కొరత నివారణకు ఆప్కో సిల్క్ పార్కులు: చిల్లపల్లి
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (19:00 IST)
పట్టు కొరతను అధికమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేయతలపెట్టిన సిల్క్ సిటీ పార్కులకు ఆప్కో భాగస్వామిగా మారనుందని సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు తెలిపారు. సిల్క్ సిటీ పార్కుల ఏర్పాటు విషయంలో ప్రవేటు భాగస్వాములు ముందడుగు వేయని క్రమంలో చేనేత రంగ మనుగడను దృష్టిలో ఉంచుకుని ఆప్కో తొలి వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించాలని నిర్ణయించిందన్నారు.

 
మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో పట్టుపరిశ్రమ శాఖ అధికారులతో ఆప్కో ఛైర్మన్, ఇతర అధికారులు సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రములో పట్టు వస్త్రముల తయారీకి కావలసిన ముడి సిల్క్ ఉత్పత్తి చేయుటకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ప్రవేటు భాగస్వామ్యంతో సిల్క్ సిటీలు నేలుకొల్పే అంశంపై చర్చించారు.

 
పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పధకం వివరాలను అందిస్తూ సుమారు 51.25 ఎకరముల స్థలం అవసరం కాగా, 50 ఎకరములలో మల్బరీ మొక్కలు, పట్టు పురుగుల  పెంపకము, 1.25 ఎకారములలో పట్టు పురుగులనుండి పట్టు రీలింగ్, ముడి పట్టు ఉత్పత్తి కోసం 25 షేడ్స్ ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు.

 
పెట్టుబడి రూపేణా ఒక్కక్క ఎకరానికి తొలిసారి రూ. 2.30 లక్షలు, ప్రతి సంవత్సరము Rs.1,73 లక్షలు వెచ్చించవలసి ఉంటుందని, ఒక్కక్క షెడ్ ఏర్పాటుకు రూ. 10.75 లక్షలు అవసరం కాగా,  ఎకరానికి 750కిలోలు ఉత్పత్తి ద్వారా రూ.52 వేల వరకు లాభము సమకూరుతుందన్నారు.  ప్రాజెక్ట్ వ్యయంలో 75శాతం కేంద్ర ప్రభుత్యము, 15శాతం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ద్వారా అందించనుండగా పదిశాతం ప్రవేటు వ్యక్తులు భరించవలసి ఉంది.

 
ప్రభుత్వాల పరంగా పెద్ద ఎత్తున రాయితీలు ఉన్నప్పటికీ ప్రవేటు వ్యక్తులు ఆసక్తి చూపని నేపధ్యంలో తొలి ప్రాజెక్టును ఆప్కో చేపట్టాలని నిర్ణయించింది, ఈ క్రమంలో అరకులో ఆప్కో పట్టు ఉత్పత్తి పరిశ్రమను ప్రారంభించేందుకు ప్రాధమికంగా అవగాహనకు వచ్చింది. ఉత్పత్తి అయిన పట్టును ఆప్కోనే కొనుగోలు చేసి తిరిగి చేనేత కార్మికులకు విక్రయిస్తుంది.

 
ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మాట్టాడుతూ, ఆప్కోకు కావలసిన సిల్క్ వస్త్రములు అనంతపురము, చిత్తూరు తూర్పు గోదావరి జిల్లాల లోని ధర్మవరము, మదనపల్లి, పెద్దాపురముల నుండి సమీకరిస్తామని, గత రెండు సంవత్సరాలగా కరోనా వలన సిల్క్ వస్త్రముల తయారీకి కావలసిన ముడి సిల్క్ తగినంత ఉత్పత్తి లేక ధరలు రెండింతలు పెరిగాయ న్నారు. ఫలితంగా పట్టు వస్త్రముల ధరలను పెంచక తప్పలేదని, ఈ సరిస్ధితులను అధికమించేందుకు పట్టు ఉత్పత్తిని  ఆప్కో ద్వారా చేపట్టాలని నిర్ణయించామన్నారు. ముడి సిల్క్ విరివిగా లభ్యం అవటం వల్ల చేనేత కార్మికులకు నిరంతరమూ పని కల్పించటం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకులు  సర్జిత బేగమ్ , సీనియర్ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో మరో పది రోజుల్లో శ్రీనివాస సేతు ప్రారంభం