సరికొత్త వరవడికి ఆప్కో శ్రీకారం చుట్టింది. విజయవాడలో నూతన చేనేత వస్త్ర శ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ అదరహా అనిపించింది. చేనేత సంస్కృతి సంప్రదాయాలతో ఆప్కో సంక్రాంతి సంబరాలను ముందే అందించింది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన సాంప్రదాయ వస్త్రాలతో ప్రదర్శన నిర్వహించిన ముద్దుగుమ్మలు ఆహా అనిపించారు.
చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలా ఒకటా రెండా వందలాది డిజైన్లతో ప్రత్యేకించి యువతను ఆకర్షించే విధంగా రూపుదిద్దిన ఆప్కో వస్త్రాల ప్యాషన్ షో కేక పుట్టించింది. చేనేత వస్త్రాలంటే వయోజనులు, వృద్దులకే అన్న నానుడిని తుడిచివేస్తూ ర్యాంప్ వాక్ సాగింది. ఆప్కో రూపొందించిన నూతన డిజైన్ల వస్త్ర శ్రేణి ఫలితంగా యువతుల అందం రెట్టింపు అయ్యిందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు.
సంక్రాంతి, నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఆప్కో మేగాషోరూమ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆప్కో చేనేత వస్త్ర ప్యాషన్ షో ఆహుతులను విశేషంగా అలరించింది. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండి చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన అన్ని చేనేత వస్త్రాలను ఫ్యాషన్ షో ద్వారా ప్రదర్శింప చేసారు. చేనేత వస్త్రాలను నేటి యువతీయువకులు చేరువ చేసేక్రమంలో ఏర్పాటుచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మోడల్స్ తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛంధంగా ర్యాంప్ వాక్ లో పాల్గొనటం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుంచి చేనేత కళాకారులు తయారు చేసిన మంగళగిరి ఫైన్ కాటన్, ఉప్పాడ జాంధానీ బుట్టా, అంగర సీకో కాటన్, పెడన కాటన్, పోలవరం, ఐదుగుళ్లపల్లి, వేంకటగిరి కాటన్, సిల్క్ చీరలు, మాధవరం కాటన్, చీరాల కుప్పడం, ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు, మంగళగిరి, చీరాల డ్రెస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్ పంచెలు, షర్టింగ్స్, కండువాలు; భట్టిప్రోలు కాటన్ పంచెలు; మంగళగిరి, చెరుకుపల్లి, చీరాల కాటన్ షర్టింగ్స్, పొందూరు ఖాదీ పంచెలు, కండువాలు, రెడీమేడ్ షర్టింగ్స్, లేడీస్ టాప్స్ మోడల్స్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు.
ప్యాషన్ షో నేపధ్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మెహనరావు మాట్లాడుతూ, చేనేత వస్త్రాలు అందంతో పాటు హుందాతనాన్ని ఇస్తాయని, ఆరోగ్యపరంగాను, పర్యావరణపరంగాను ఎంతో అనుకూలమైనవన్నారు. ముఖ్యమంత్రి చేనేతల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి ఆర్థికాభివృద్ధి కోసం, ఎల్లా వేళల పని కల్పించే లక్ష్యముగా సొంత మగ్గము ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికునికి నేతన్న నేస్తం పధకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.24 వేలు వారికి అందిస్తున్నారన్నారు.
ఆప్కో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రత్యేక శ్రద్ద వహించి చేనేత కళను ప్రోత్సహింస్తూ ఆప్కోను అభివృద్ధి బాటలో నడిపించటానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర చేనేత వస్ర్త శ్రేణికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా కాలానుగుణ ఫ్యాషన్లకు అనుగుణంగా నూతన వెరైటీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కో జిఎమ్లు కన్నబాబు, ఎమ్ నాగేశ్వరావు , బి నాగేశ్వరావు, మురళి కృష్ణ, నాగరాజరావు, రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు రమేష్ బాబు, సుదర్శన్, శ్రీ లలిత ఇతర అధికారులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.