గూగుల్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆయన పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు. ఓకే గూగుల్... సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అంటూ అందులో పేర్కొన్నారు. 'Ok Google' అనేది గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించే వాయిస్-యాక్టివేటెడ్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్‌ను వాడి చంద్రబాబు పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకున్న విషయం తెల్సిందే. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు.
రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టును విశాఖకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాష్ట్ర శాఖామంత్రి నారా లోకేశ్ కృషిని కూడా ఆయన అభినందించారు.
తాను ఎప్పటి నుంచో టెక్నాలజీతో అనుసంధానమై ఉన్నానని, హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం నుంచి ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నానని గుర్తుచేశారు. ప్రతి కుటుంబానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ని చేరువ చేయడంతో పాటు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే మా లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు.