రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 90 శాతం సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని, తమ ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించబోదని ఆయన స్పష్టంచేశారు.
గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని, యోగా నేర్పించే పరిస్థితి రావాలని దీనిపై ఇప్పటి నుంచి శ్రద్ధ పెట్టాలని, పిలిచి మాట్లాడాలని ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్‌కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
ఇందులో సీఎం బాబు పాల్గొని మాట్లాడుతూ, ఎపుడైనా సరే ఆపరేషన్.. ఆపరేషనే. భగవంతుడు ఇచ్చిన సహజసిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదు. సిజేరియన్‌లలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇది ఏమాత్రం సరికాదు. ఇలాంటివి ఎలా నియంత్రించాలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగితే అందులో 42 శాతం ప్రభుత్వాసుపత్రులో జరుగుతున్నాయన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష. వచ్చే యేడాదికి రాష్ట్రంలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారు. 2047 నాటికి చైనా జనాభా వంద కోట్లే ఉంటుంది. అప్పటికి భారత్‌లో 162 కోట్లు అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా క్రమంగా తగ్గుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ తగ్గిపోతుందన్నారు. యూపీ, బీహార్ రాష్ట్రాల వల్లే మన దేశంలో జనాభా బ్యాలెన్స్ అవుతుందన్నారు.