సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని మఖ్దూం భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన సురవరం పార్ధివ దేహానికి సీఎం బాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయనతో తనకున్న జ్ఞాపకాలను అక్కడి నేతలతో పంచుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమం, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు.
"సురవరంతో నాకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సుధాకర్ రెడ్డి, నేను కలిసి ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. నిత్యం ప్రజాహితం కోసం కలిసి పోరాడాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలకు సేవలందించారు. సుధాకర్ రెడ్డి నన్ను ప్రత్యేకంగా అభిమానించేవారు. నేను చేసే పనుల్ని, కార్యక్రమాల్ని అభినందించి ప్రోత్సహించేవారు. ఆయన సేవల్నీ పోరాటలను నా జీవితంలో ఎపుడూ మర్చిపోలేను. సుధాకర్ రెడ్డి భౌతికంగా మనకు దూరమైనా ఆయన పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారు. సుధాకర్ రెడ్డి మరణం సీపీఐతో పాటు తెలుగువారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుకుంటున్నాను" అని చంద్రబాబు అన్నారు.