ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉచిత పథకాలు అవసరం లేదు. రాష్ట్రం అభివృద్ధి కావాలి. వ్యాపారస్తులకు తమ వ్యాపారాభివృద్ధికి అనువైన వనరుల కల్పన కావాలి. డిగ్రీ చదువుకున్న ప్రతి యువతీయువకులకు తమకు తగిన ఉద్యోగం కావాలి. రైతులకు తాము పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధరలు కావాలి. సమయానికి పంట నీరు, విత్తనాలు, ఎరువులు కావాలి. అంతేతప్ప తమ ఖాతాల్లో ఏడాదికి ఒకసారి పడే ఉచిత నగదు అవసరం లేదని చాలామంది ప్రజలు బహిరంగంగానే చెప్పడం కనబడుతోంది.
ఆటో డ్రైవర్ సేవలో పథకం ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించింది. దీని తర్వాత కొందరు ఆటోడ్రైవర్లు మాట్లాడుతూ... మాకెందుకండీ ఆ డబ్బు. ఉచిత బస్సు ఎత్తేయండి, మా కష్టంతో మేము బ్రతుకుతాం అంటున్నారు. అంటే... ఉచితంగా డ్రైవర్లకు వారి ఖాతాలో వేసిన డబ్బు వారికి అవసరం లేదనే కదా. అలాగే.. ఉచిత బస్సులో సీట్ల కోసం కొట్టుకుంటూ ఎక్కుతున్న మహిళలు రాష్ట్రంలో ఎక్కడా కనబడటంలేదు. ప్రభుత్వం సదుపాయం కల్పించింది కనుక ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఏ ఉచిత పథకం కావాలని ఆనాడు కూటమి పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదని చాలామంది చెప్పుకుంటున్న మాట.
కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు అన్ని జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందితే చాలు... ఏపీలో వున్న ప్రజలంతా ఉచితాలతో పనిలేకుండా కుబేరులవుతారనే భావనలో వున్నట్లు చాలామంది వ్యక్తపరుస్తున్న మాట. ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పసిగట్టినట్లే వున్నారు. దానికి అనుగుణంగా ఆయన ట్వీట్ కూడా చేసారు. ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగటం లేదనీ తమకు 25 సంవత్సరాల భవిష్యత్తును అడుగుతున్నారంటూ మంత్రి నాదెండ్ల షేర్ చేసిన ట్వీటుకి రీట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇదే ఏపీలో వున్న నిజమైన స్థితి.