Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Advertiesment
దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
, శనివారం, 28 డిశెంబరు 2019 (21:30 IST)
దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇందుకు ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికలే నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా పౌరయుద్ధ పరిస్థితులను కల్పించేందుకే నేషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఎస్ఆర్సీ), మత ఆధారితీ పౌరసత్వ చట్ట సవరణ చట్టం (సీఏఏ) ద్వారా బీజేపీ జిమ్మిక్కులు చేస్తోందన్నారు.

విజయవాడ దాసరిభవన్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటికే ఓటర్ల జాబితా, ఓటు కార్డులుండగా మళ్లీ ఎస్వీఆర్ తేవడం కేవలం ఓటు బ్యాంకు కోసమే అని ఆయన విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు మినహా మిగిలిన వారిని చేర్చుకుంటామని పార్లమెంటులో ఆమోదించిన బిల్లు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు.

ఈ బిల్లు ఆధారంగా మళ్లీ దేశవ్యాప్తంగా సర్వే చేయడం పూర్తిగా ఓటర్లు, రాజకీయపార్టీలను బ్లాక్ మెయిల్ చేసే తంతుగా ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అలజడి, మతకలహాలను సృష్టించి హిందువులను ఓటు బ్యాంకుగా చేసుకునే కుట్ర తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు. వేలాది కోట్ల వ్యయంతో కూడిన ఎస్పీజరు సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. దేశంలో గాంధీని ఆర్ఎస్ఎస్ వారే హతమార్చారని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాందీలను చంపినవారిలో ముస్లింలు లేరన్నారు.

దేశం విడిచిపోయిన ఆర్థిక నేరగాళ్లలో ఒక్కరు కూడా ముస్లింలు లేరని ఆయన తెలిపారు. ఉగ్రవాదం ఏ మతంలో, కులంలో కూడా వ్యతిరేకించాల్సిందే అన్నారు. అయితే కేవలం ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికే కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు తమకు ప్రత్యేక దేశాలు కావాలని కోరుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాలు కూడా విడిపోతామనే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

దేశ సమైక్యతను దెబ్బకొట్టేందుకే నరేంద్రమోడీ-అమిత్ షా ఇద్దరూ కంకణం కట్టుకున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో దాడులకు పాల్పడి భయోత్పాతాన్ని  సృష్టిస్తున్నారని తెలిపారు. బీజేపీ ఆర్థిక నేరగాళ్లను మోస్తూ, కార్పోరేట్ల కంపెనీలకు రాయితీలను ఇవ్వడాన్ని తప్పుబట్టారు. బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా కార్పోరేట్లకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్నాల్వెన్సీ సర్టిఫికెట్ల పేరుతో కార్పోరేట్లకు సాయం చేస్తూ, గతంలో చేసిన నేరాలకు శిక్షలు వేయకుండా దేశాన్ని దోచుకోవడానికి కేంద్రం సహకరిస్తోందన్నారు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో మతాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ద్వంద్వ ప్రమాణాలు అలంభించడం దారుణమన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఢిల్లీలో ఎస్ఆర్సీకి అనుకూలంగా ఓటు వేసి, తీరా ఆ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి అందర్నీ కలుపుకుని ఉద్యమాలకు సమాయత్తమవుతున్నారని తెలిపారు.

అలాగే ఎస్ఆర్ సీకి ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ లో బీజేపీ ఘోరపరాజయం పాలవ్వడంతో ప్లేటు ఫిరాయించారన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ సహా ఐదారు రాష్ట్రాల సీఎంలు ఎస్ఆర్సిని అమలు చేయబోమని ప్రకటించారన్నారు. ఏపీ సీఎం జగనకు చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా ప్రకటన చేయాలని, వామపక్షాలు సహా కలిసొచ్చే పార్టీలను కలుపుకుని ఉద్యమించాలని నారాయణ సూచించారు. సజావుగా పరిపాలన సాగిస్తున్న జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసి వివాదాన్ని సృష్టించారని నారాయణ స్పష్టం చేశారు.

గత సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అంగీకరించడంతో ఏకపక్షంగా తీర్మానించారన్నారు. తర్వాత వైసీపీ అధికారం చేపట్టడంతోనే విధ్వంసకర చర్యలు చేపట్టిందని, ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేయడం శోచనీయమన్నారు. అవినీతి జరిగిందని చెబుతూ పనులు జరుగుతున్న ప్రాజెక్టులన్నీ ఆపేశారన్నారు. తాజాగా రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని జగన్ చేసిన ప్రకటన ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా, ఇష్టానుసారంగా రాజధానులను మార్చే రాజకీయ నైతిక హక్కు జగన్కు లేదన్నారు. ఒకవేళ రాజధానిని మార్చాలనుకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, మేనిఫెస్టోలో మూడు రాజధానుల విషయాన్ని పొందుపరచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజధానిని మార్చాలని సూచించారు. 

ప్రజాతీర్పు లేకుండా అమరావతి జోలికి రావడం సరికాదన్నారు. అధికార వికేంద్రీకరణలో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది కేవలం భ్రమ మాత్రమే అన్నారు. రాజధానిపై మరో కమిటీ వేయడం పై స్పందిస్తూ.. కమీటీల వల్ల ఎలాంటి ఉ పయోగం లేదని, ముందే సీఎంలు చెప్పిన ప్రకారమే కమిటీలు నివేదికను రూపొందిస్తాయే తప్ప అధ్యయనం చేసేది ఉండదన్నారు. ఈ కమిటీలన్నీ కేవలం కాలయాపన చేసేందుకే అని ఆయన స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నారాయణ కోరారు. భూబకాసురుల పేర్లను బయటపెట్టాలి అక్రమ పద్ధతుల్లో ఎవరు భూములు కొనుగోలు చేసినా, చట్టవిరుద్ధంగా భూములు తీసుకున్నా జైలుకు పంపాలని తాము ముందునుంచీ కోరుతున్నామని నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిందని, విశాఖ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని జగన్ సర్కారు మాటలతో సరిపెడుతుందే కానీ చేతల్లో చూపడం లేదన్నారు.

ఈ వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నాయకుల హస్తం ఉందని, బినామీ పేర్లతో భూములను కాజేశారన్నారు. విశాఖ భూముల విషయమై తాము అప్పట్లో ఆందోళన చేస్తే చంద్రబాబు సిలో విచారణ జరిపించారే కానీ నివేదికను బయట పెట్టలేదన్నారు. అలాగే జగ అధికారంలోకి వచ్చాక కూడా సిట్ వేసారే కానీ నివేదికను వెల్లడించలేదన్నారు.

భూదొంగల్లో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ధర్మాన ప్రసాదరావు కుమారుడు, వైసీపీ నాయకులున్నారని తెలిపారు. సీపీఐ అందచేసిన జాబితాలో పేర్కొన్న వివరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సిట్ నివేదికలు, భూభాగోతం వెనుక ఉన్న పెద్దల పేర్లను బహిర్గతం చేయాలని నారాయణ డిమాండు చేశారు. 
 
30న రాజధానిపై సమావేశం: ముప్పాళ్ల నాగేశ్వరరావు 
రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 30వ తేదీన విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. అమరావతి రాజధానిగా 13 జిల్లాల అభివృద్ధికి సానుకూలంగా ఉండే వివిధ పక్షాలను ఈ సమావేశానికి ఆహ్వానిస్తామన్నారు. అన్ని విషయాలపై కూలంకుషంగా చర్చించి భవిష్య కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

రాజధానికి సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎస్ రావు కమిటీ నివేదిక సమర్పించక ముందే అసెంబ్లీలో సూచన ప్రాయంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్రమైన వివాదాలు, ప్రాంతీయ వైషమ్యాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అలోచన రహితంగా, కక్షపూరితమైన రాజకీయాలు వేలాది ఎకరాలు భూములిచ్చిన రైతుల కన్నీటికి దారితీసాయన్నారు.

రాజధాని ఎట్టిపరిస్థితుల్లో అమరావతిలోనే ఉండాలన్నారు. రాజధాని అభివృద్ధితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. పారిశ్రామికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్య, జి.ఓబులేసు, కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11మంది యువకులు ఏడాదిగా యువతిపై అత్యాచారం, బిడ్డకు జన్మ.. ఆ తరువాత?