కరోనా సమయంలో అందరికీ ఆపద్బాంధవుడిగా కృష్ణపట్నం ఆనందయ్య నిలిచాడని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. శ్వాస ఆడక ఎంతో మంది మరణించారని, అలాంటి రోగులకు కరోనాను నయం చేసి ఆనందయ్య దేవుడిలా ఆదుకున్నారని అన్నారు.
విజయవాడలో ప్రజలకు ఆనందయ్య మందును మేయర్ పంపిణీ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ షాదిఖాన దగ్గర మాజీ ఫ్లోర్ లీడర్ దొనేపుడి శంకర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ అతిధిగా పాల్గొన్నారు. ప్రజలకు కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా మందు తయారుచేయడం ఒక ఎత్తు అయితే, ఆనందయ్య మందు తయారీకి, పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు అందించిన సేవలు అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు మేయర్ భాగ్యలక్ష్మిని, కృష్ణపట్నం ఆనందయ్యను ఘనంగా సన్మానించారు.