Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిజిస్ట్రేష‌న్ల‌లో తవ్విన కొద్దీ అవినీతి... మండవల్లిలో రూ.2 కోట్లు స్వాహా

రిజిస్ట్రేష‌న్ల‌లో తవ్విన కొద్దీ అవినీతి... మండవల్లిలో రూ.2 కోట్లు స్వాహా
విజయవాడ , శనివారం, 14 ఆగస్టు 2021 (15:43 IST)
ఆ ఆస్తి విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీ రూ.1.5లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ బ్యాంకులో చలానా కేవలం రూ.15వేలు చెల్లించారు. ఆ చలనాను కంప్యూటర్‌ ఫొటో షాప్‌లో మార్ఫింగ్‌ చేశారు. ఒక సున్నా పక్కన చేర్చారు. అక్షరాలు మార్చారు. ఆ రశీదును యధావిధిగా అప్‌లోడ్‌ చేశారు. అంటే ఈ వ్యవహారంలో రూ.1.35 లక్షలు స్వాహా చేశారు. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వెలుగు చూసింది.

ఇలాంటి చిత్రాలెన్నో రిజిస్ట్రేష‌న్ల‌లో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో రూ.3 కోట్లు పైగా స్వాహా చేసినట్లు తెలిసింది. ఇంకా పరిశీలన జరుగుతోంది. కృష్నా జిల్లాలో అయిదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ చలానా అక్రమాలు జరిగినట్లు వెలుగు చూసింది. తవ్విన కొద్దీ అవినీతి ఊట ఊరుతోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కేంద్రంగా ఈ చలనా అక్రమాలు జరిగినట్లు తెలిసింది.

ఓ ప్రముఖ దస్తావేజు లేఖరుల సోదరులు కీలక పాత్ర వహించినట్లు సమాచారం. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక్క మండవల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదైంది. మిగిలిన కార్యాలయాలపై కూడా కేసులు నమోదు చేయనున్నారు. పటమట, ఆస్తి రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాలో ఆస్తి కొనుగోలుదారుడు, దాస్తావేజు లేఖరి అవకతవకలు చేశారని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ వల్లపు వెంకటేశ్వర్లు మాచవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... జులై 30న ఫాకీరుగూడెం ప్రాంతంలో రూ.63.80 లక్షల విలువైన ఆస్తి రిజిస్టేషన్‌కు సంబంధించి రూ.1.27లక్షల చలానా కట్టాలి. దానికి బదులు రూ.10వేలు మాత్రమే చలానా కట్టినట్లు తనిఖీల్లో గుర్తించారు. ఈ నకిలీ చలానాకు దాస్తావేజు లేఖరి ఎస్‌.పవన్‌ ప్రమేయంతోనే జరిగిందని తెలిపారు. వీరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ ఎం.ప్రభాకర్‌ తెలిపారు.

జిల్లాలో పటమట కేంద్రంగానే అక్ర‌మాలు ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ఇక్కడ ఓ దస్తావేజు గాంధీనగర్‌లో రిజిస్టర్‌ చేశారు. అక్కడ కూడా రూ.70వేలు కట్టాల్సిన చలానాను రూ.10వేలు మాత్రమే చెల్లించారు. దీనిపై విచారణ జరుగుతోంది. పటమటలో దాదాపు రూ.73లక్షల రుసుములు తేడా వచ్చినట్లు తెలిసింది. పరిశీలించే కొద్దీ వెలుగుచూస్తున్నాయి.

ఇక మండవల్లిలో ఏడాదికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆదాయం రూ.9కోట్లు. కానీ ఈ చలనా పేరుతో గండికొట్టిన ఆదాయం రూ.2కోట్లుగా తేలింది. మొదటి రోజు రూ.77లక్షలుగా నిర్ధారించారు. కేవలం నాలుగు నెలలు పరిశీలన చేస్తేనే అంతమొత్తం తేలింది. మరో 394 డాక్యుమెంట్లు పరిశీలన చేశారు. వాటిలోనూ తేడాలు గమనించారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని అనుమానం ఉన్న డాక్యుమెంట్లు తేవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడ డాక్యుమెంట్‌ రైటర్లు (దస్తావేజు లేఖర్లు) ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో ఈ చలానాను వాడుకుని ఇలా భారీగా స్వాహా చేసినట్లు తెలిసింది. గాంధీనగర్‌లోనూ కొన్ని డాక్యుమెంట్లు వెలుగుచూశాయి. పటమట నుంచి పంపిన డాక్యుమెంట్లు తేడా ఉన్నట్లు తెలిసింది. గుణదలలోనూ కొన్ని డాక్యుమెంట్లు గమనించారు. మొత్తం వివరాలను క్రోడీకరిస్తున్నారు. మరో కార్యాలయంలోనూ తేడాను గుర్తించారు. పటమటలో కొంతమంది దస్తావేజు లేఖరులుగా తిష్ట వేశారు. ఈ ముఠా వద్ద రూపొందిన డాక్యుమెంట్లు అన్నీ తేడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవం కంటే తగ్గించి రుసుములు చెల్లించడం, చలానాలు మార్ఫింగ్‌ చేయడం ద్వారా స్వాహా చేసినట్లు తెలిసింది. జిల్లాలో 26 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చేతిరాత లేనందున దస్తూరి పేరు ఉండడం లేదు. డాక్యుమెంటు రైటర్లు ఎవరనేది పార్టీ చెబితేనే తేలుతుంది. కానీ వాస్తవంగా ఆధారాలు లభించే అవకాశాలు లేవు.

పటమట నుంచి గాంధీనగర్‌కు వెళ్లిన ఒక పార్టీ తక్కువ కట్టడంతో పూర్తి సొమ్ము కట్టేందుకు వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై కేసు పెడతారా లేదా అనేది తెలియలేదు. ఈ చలానాల బాగోతంపై విజయవాడ ఐజీ శేషగిరిరావు మాట్లాడుతూ ఐదు కేంద్రాల్లో అవతవకలు వెలుగు చూశాయని ధ్రువీకరించారు. .

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్, ఇండియా విభ‌జ‌న క‌ష్టాలు ఇంకా మ‌ర్చిపోలేం!