Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగిసిన మారుతీ రావు అంత్యక్రియలు... చివరిచూపు చూసిన కుమార్తె

Advertiesment
Maruthi Rao Suicide
, సోమవారం, 9 మార్చి 2020 (12:55 IST)
పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మిర్యాలగూడకు చెందిన మారుతీ రావు ఆత్మహత్య చేసుకోగా, ఆయన అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. మిర్యాలగూడలోని శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరుగుతున్న వేళ, ఆయన కుమార్తె అమృత అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. 
 
తండ్రికి తుదిసారి నివాళులు అర్పించాలంటూ, తనవారితో కలిసి పోలీసు వాహనంలో అమృత అక్కడికి రాగా, మారుతీరావు బంధుమిత్రులు వాహనాన్ని అడ్డుకున్నారు. అమృత రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. 'మారుతీరావు అమర్ రహే', 'అమృత గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. 
 
కనీసం తల్లిని పలకరించేందుకు కూడా ఆమె రాలేదని కేకలు వేశారు. దీంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే, క్షణాల వ్యవధిలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలకూ నచ్చజెప్పిన పోలీసులు, బందోబస్తు మధ్యే అమృతను తిరిగి ఇంటికి చేర్చారు. ఆపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ తన అన్న అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇదిలావుండగా, మారుతీరావు ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలని సమీప మిత్రులు, బంధువులు చెబుతున్నారు. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఈదులగూడెంలో వ్యాపార సముదాయాన్ని విక్రయించగా, తన సోదరుడికి సైతం ఆ ఆస్తిలో వాటా ఉండటం, సంబంధిత నగదు సోదరుడి వద్దకే చేరడం, బ్యాంకు నుంచి నోటీసులు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు సమీప మిత్రుల ద్వారా తెలిసింది. 
 
ముఖ్యంగా, అమృత ప్రేమ వివాహం, ప్రణయ్‌ హత్య నేపథ్యంలో మారుతిరావు దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. మానసిక ఒత్తిడిని జయించేందుకు మారుతిరావు హైదరాబాద్‌లో చికిత్స సైతం తీసుకుంటున్నారు. ఇటీవల మానసిక ఒత్తిడి తీవ్రమవడంతో వైద్యుడిని సంప్రదించగా, ఆయన అందుబాటులో లేకపోవడం, మందులు అయిపోవడం, మరోవైపు ప్రణయ్‌ హత్య కేసు విచారణకు రావడం, న్యాయవాదిని మాట్లాడుకునే ప్రయత్నంలో హైదరాబాద్‌కు తిరగడం ఇదిలా ఉంటే ఆర్థికంగా ఖర్చుల కోసం చేతిలో డబ్బులు లేకపోవడం మారుతిరావుకు ప్రధాన ఇబ్బందిగా మారింది. 
 
పైగా, ఆయన పేరిట ఆస్తులు భారీగా ఉన్నా వాటిని విక్రయిస్తే కొనేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడం కూడా ఆయన్ను కుంగదీసింది. రూ.కోట్లలో డీల్ చేసిన మారుతీ రావు చివరకు రూ.50 వేల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయనకు చెందిన పలువురు మిత్రులతో తమ బాధను వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీ సందర్భంగా మసీదు మూసివేత... పాక్‌లో రెండు రోజుల సెలవు