తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూత కులపిచ్చి విష వలయం ఉందని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం టీడీపీ రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ తిరిగి వైకాపా గూటికే చేరుకున్నారు. గురువారం అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
ఈ పరిణాంపై ఆమంచి కృష్ణమోహన్ స్పందిస్తూ, చంద్రబాబు చుట్టూ ఉన్న ఈ విషవలయం రాష్ట్రాన్ని పెకిలించి వేస్తోందన్నారు. పరిపాలనా యంత్రాంగంగానీ పార్టీగానీ చంద్రబాబు సామాజిక వర్గంతో నింపి అక్రమమార్గంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
పరిపాలనలో కీలక అధికారులంతా చంద్రబాబు మనుషులే ఉన్నారని, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఇంటెలి జెన్స్ చీఫ్ వరకు అంతా ఆయన మనుషులేనన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్‌ని పర్యవేక్షించేందుకు ఓ డీఐజీ పోస్టును సృష్టించి, చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాసరావుకి ఆ పోస్టును కట్టబెట్టారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు.