ఇడ్లీలు మూడేళ్లైనా పాడవకుండా వుంటాయట.. ఎలాగో తెలుసా?

గురువారం, 14 ఫిబ్రవరి 2019 (18:10 IST)
ఆధునికత, సాంకేతికత పెరిగే కొద్ది సోమరితనం కూడా పెరిగిపోతుంది. గంటల్లో చేసే పని చిటికెలో చేసేలా సాంకేతిక పరికరాలు వచ్చినా.. చాలామంది జనులు హడావుడిలో ఆహారంపై శ్రద్ధ పెట్టట్లేదు. ఏదో పూట గడవాలని హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. లేకుంటే ఆన్‌లైన్‌‍లో ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. దీంతో టైమ్ వేస్ట్ కాదని అనుకుంటున్నారు కోట్లాది మంది. 
 
ఇలా యాంత్రిక జీవనంలో ఆహారం విషయంలో శ్రద్ధ చూపకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయనే విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కనబెడితే.. హడావుడిలో వంటలు చేసి.. తినడానికి కూడా సమయం లేకుండా బాక్సుల్లో కుక్కి.. చివరికి పాడైపోవడంతో డస్ట్ బిన్‌లో పారేసే వారు కూడా చాలామందే వున్నారు. 
 
అలాంటి వారి కోసం కొత్త విధానం కనిపెట్టారు.. ముంబై యూనివర్శిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ వైశాలి బాంబ్లే. వైశాలితో కూడిన పరిశోధకుల బృందం.. టెక్నాలజీ సాయంతో పాపులర్ టిఫిన్ ఐటెమ్స్ ఇడ్లీ, వైట్ డోక్లా, ఉప్మాను మూడేళ్ల పాటు చెడకుండా వుండేలా ప్రిజర్వేషన్ తరాహాలో కాకుండా షెల్ప్ పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతి ద్వారా ఇడ్లీలు వంటివి మృదువుగా, రుచికరంగా, ఎలాంటి పోషకాలు తగ్గకుండా తాజాగా వుంటున్నాయని ప్రొఫెసర్ వైశాలి చెప్పారు. 
 
ఈ పద్దతి ద్వారా ఆహారానికి ఎలాంటి హాని కలగదని.. దాన్ని తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని వైశాలి వెల్లడించారు. ఇలా నిల్వ చేయబడిన ఆహారాన్ని గత 90 రోజుల పాటు ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని.. ఆ ఆహారం తీసుకున్న వారు ఆరోగ్యంగానే వున్నారని పరిశోధకులు ధ్రువీకరించారు. 
 
దీనిపై వైశాలి మాట్లాడుతూ.. తమ బృందం మూడేళ్ల పాటు ఆహారాన్ని భద్రపరిచి వుంచగల పద్ధతిని కనుగొన్నామని.. ఈ మెషీన్‌లో వుంచిన ఆహారం ఎలాంటి రసాయనాలు చేర్చకుండానే మూడేళ్ల పాటు పాడవకుండా అలానే వున్నాయని తెలిపారు. ఈ పరిశోధన కోసం 2013 నుంచి పనిచేస్తున్నామని.. తొలిసారిగా ఆహారాన్ని నిల్వ చేసే అంశంపై దృష్టి పెట్టామని.. తద్వారా వ్యోమగాములకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. 
 
ఈ విధానం ద్వారా భద్రపరిచిన ఆహారాన్ని సైనికులకు, వ్యోమగాములకు పంపడం ద్వారా పోషకాలతో నిండిన ఫుడ్‌ను వారికి అందించిన వారమవుతామని వైశాలి చెప్పారు. ఇలా గత మూడేళ్ల క్రితం ఇందులో భద్రపరిచిన ఇడ్లీని వెలుపలికి తీసి వాడామని తెలిపారు.

పలు ఆహార పదార్థాలను ఇందులో వుంచి చూశామని.. కానీ మూడు పదార్థాలు మాత్రం మూడేళ్ల పాటు పాడవకుండా అలానే వుంచిందన్నారు. అందులో ఉప్మా, ఇడ్లీ, వైట్ డోక్లా వున్నాయన్నారు. ఇలా నిల్వ చేసిన పదార్థాలను ప్రకృతీ వైపరీత్యాల వంటి అనూహ్య పరిస్థితుల్లో వాడుకునే వీలుంటుందని ఆమె వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చంద్రబాబుకు షాకిచ్చిన అవంతి శ్రీనివాస్ : నువ్వు ఉంటే ఎంతా.. పోతే ఎంత? బాబు ఫైర్