చీరాల నియోజకవర్గంలో ఆమంచి బ్రదర్స్‌కు మంచి పేరే వుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అంటే చీరాల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మంచి పేరుంది. ఆయన నిలబడితే ఎదుటి వ్యక్తి గెలుపు అసాధ్యం అంటుంటారు. అలాంటి నాయకుడు తెదేపాకు రాజీనామా చేశారు. దీనితో ఆ పార్టీకి చీరాలలో పెద్ద షాక్ తగిలినట్లయింది.
వచ్చే ఎన్నికల్లో ఆమంచికి తిరిగి చీరాల నుంచి పోటీ చేసే అవకాశంపై అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆమంచి తెదేపాకు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇది నిజం కావడంతో తెదేపా అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఐతే ఆమంచి మాత్రం తనకు స్పష్టమైన హామీ వస్తేనే పునరాలోచన చేస్తానని అన్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పుకుంటున్నారు.
మరోవైపు చీరాల తెదేపాలో రెండు గ్రూపుల మధ్య వర్గ రాజకీయాలు జరుగుతున్నాయి. ఆమంచికి వ్యతిరేక వర్గానికి అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్ల రాజీనామా చేసినట్లు చెపుతున్నారు. రాజీనామా చేసిన ఆమంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపి తీర్థం పుచ్చుకోనున్నారు.