మోడీ - చంద్రబాబులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏకంగా ఎపి సిఎం చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అది కూడా చంద్రబాబు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలని పాకులాడుతున్నారని, లోకేష్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా అదేస్థాయిలో మోడీకి సమాధానం కూడా ఇచ్చారు.
కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా తన కుటుంబాన్ని సుస్థిరం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మోడీ చెప్పారు కానీ బాబు మాత్రం ఏకంగా మోడీ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేశారు. తల్లిని, భార్యను పట్టించుకోని మోడీ కూడా నా గురించి మాట్లాడుతారా. భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేసిన వ్యక్తి మోడీ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈ విధంగా మాట్లాడటం దేశ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది.
ఎందుకంటే ఒక దేశానికి ప్రధానికి ఉన్న వ్యక్తిపై ఇంతటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు తిట్టడం వల్ల మోడీకే లాభం తప్ప బాబుకు ఏ మాత్రం లాభం ఉండదంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే మోడీకి ప్లస్ గాను, చంద్రబాబుకు మైనస్ గాను మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.