శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి వచ్చారు. ఐశ్వర్యరాయ్ సాయి కుల్వంత్ హాల్‌లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.
అక్కడ ఆమె శతజయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా శతజయంతి కార్యక్రమాలకు హాజరు కావడానికి పుట్టపర్తి చేరుకున్నారు. తన పర్యటన సందర్భంగా, ప్రశాంతి నిలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకుముందు, సచిన్ కూడా సాయి కుల్వంత్ హాల్‌లోని మహా సమాధి వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. బాబా మన జీవితాలను తీర్చిదిద్దారు. మన ప్రియమైన బాబాకు హృదయపూర్వక ప్రణామాలు. ఇది నిజంగా ప్రత్యేకమైన సందర్భం, బాబా శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా మీ అందరినీ నేను స్వాగతిస్తున్నాను.
ఈ ప్రదేశం లక్షలాది మందికి ఓదార్పు, ఉద్దేశ్యం, దిశానిర్దేశం చేసింది. ఇక్కడ నిలబడితే, బాబా మన జీవితాలను ఎంత లోతుగా తీర్చిదిద్దాడో మరియు మనం మంచి మనుషులుగా మారడానికి సహాయం చేశాడో నాకు గుర్తుకు వస్తుంది. పాఠశాలలో సహా నా చుట్టూ ఉన్నవారు నన్ను సత్యసాయి బాబా లాంటి జుట్టు ఉన్న చిన్న పిల్లవాడు అని పిలిచేటప్పటికి నాకు ఐదు సంవత్సరాలు మాత్రమే.
మానవాళికి ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నేను మొదట 90ల మధ్యలో వైట్‌ఫీల్డ్‌లో ఆయనను కలిశాను. అప్పటి నుండి, ఆయన వద్ద చాలాసార్లు కలిసి ఆశీర్వాదం పొందాను.. అంటూ బాబాతో తనకు ఉన్న అనుబంధాన్ని సచిన్ గుర్తు చేసుకున్నారు.
5వ తరగతి చదివే రోజుల్లో నా జుట్టు కూడా సాయిబాబా జుట్టు లాగే ఉండేదని ఫ్రెండ్స్ చెప్పేవారు. అందుకే హెయిర్ కట్ చేయించుకునేందుకు నేను ఇష్టపడలేదు. నా మనసులో ఉన్న ప్రశ్నలకు అడగకుండానే బాబా సమాధానం చెప్పేవారు.. అంటూ సచిన్ వ్యాఖ్యానించారు.