రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
ప్రధాన కూడళ్లలో ట్రైయాంగిల్ బ్లింకర్స్ ఏర్పాటుచేసి ప్రమాదాల బారినపడకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. బెంజ్ సర్కిల్, ఆర్టీఏ జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్, నేతాజీ బ్రిడ్జి కూడళ్లలో ఈ అత్యాధునిక ట్రైయాంగిల్ బ్లింకర్లను ఏర్పాటుచేశారు.
బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన ట్రైయాంగిల్ బ్లింకర్లను ట్రాఫిక్ అడిషినల్ డీసీపీ బి.రవిచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటుచేసిన ట్రైయాంగిల్ బ్లింకర్లు, రేడియం కోన్ బ్లింకర్లు రోడ్డు ప్రమాదాల బారినపడకుండా వాహనదారుల అప్రమత్తం చేస్తాయని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు నగర పోలీస్ శాఖ సదా సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ జె.వెంకట నారాయణ, 5వ ట్రాఫిక్ 2వ సెక్టార్ సీఐ వై.రవికుమార్, ట్రాఫిక్ ఎస్సై టి.జగన్నాథరెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.