జగన్ కంటే చంద్రబాబు క్లీన్ పర్సన్‌గా కనిపించారు... నాగబాబు

శనివారం, 22 జూన్ 2019 (17:04 IST)
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి గల కారణాలను మెగా బ్రదర్ నాగబాబు ఇపుడు వివరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విభజన అడ్డగోలుగా జరిగిందనీ, దీంతో రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని ప్రజలంతా కోరుకున్నారన్నారు. దీంతోనే తన సోదరుడు పవన్ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారన్నారు. 
 
పైగా, ఆ సమయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో పోల్చితే చంద్రబాబు క్లీన్ పర్సన్‌గా కనిపించారన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చాలా తక్కువగా ఉంటే... జగన్‌పై మాత్రం కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ఆ ఒక్క కారణంతోనే చంద్రబాబుకు అండగా నిలబడి, టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. 
 
కానీ, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ప్యాకేజీ మాట్లాడుకుని పవన్ డబ్బులు తీసుకున్నారంటూ చౌకబారు ఆరోపణలు చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు లభిస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేని వారు ఈ దుష్ప్రచారం చేశారనీ, టీడీపీ నేతలు ఇదేదో తమకు లాభిస్తుందని భావించి మిన్నకుండిపోయారన్నారు. పైగా, మీడియా వైపు నుంచి తమకు తగినంత మద్దతు లేకపోవడంతో ప్రజల్లోకి తమ వాదనను బలంగా తీసుకెళ్లలేకపోయామని నాగబాబు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్....