ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
నిజానికి "అజ్ఞాతవాసి" చిత్రం తర్వాత పవన్ ఒక్క చిత్రంలో నటించలేదు. అదేసమయంలో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమైపోయారు. కానీ ముగిసిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిని చవిచారు.
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇపుడు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మించే చిత్రంలో పవన్ నటిస్తారని తెలుస్తోంది.
మరోవార్త ఏంటంటే... పవన్ కళ్యాణ్ కూడా నిర్మాణ రంగం వైపు దృష్టి సారించినట్టు టాక్. పవన్ కల్యాణ్ క్రియేటివ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. పైగా, ఈ బ్యానర్‌పై కొన్ని సినిమాలను నిర్మించారు. ఇప్పుడు రాంచరణ్‌తో సినిమా చేయబోతున్నారని టాక్ వినపడుతుంది.
ఇదివరకే తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేయమని కోరారట. అందుకని త్రివిక్రమ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమా 2019 చివర, లేకుంటే 2020 ప్రథమార్థంలో పూర్తవుతుంది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్‌లో చెర్రీ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.