Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన టీడీపీ - ఉండి అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్

Advertiesment
rrr - chandrababu

వరుణ్

, ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (17:14 IST)
ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వల్ప మార్పులు చేశారు. తాజాగా ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైకాపా రెబెల్ నేత రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటును కేటాయించారు. అలాగే, గిడ్డి ఈశ్వరికి పాడేరు టిక్కెట్ కేటాయించరు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ మూర్తిని ఎంపిక చేశారు. అలాగే, మడకశిర, వెంకటగిరి అభ్యర్థులను కూడా ఆయన మార్చారు. 
 
చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి నియోజకవర్గాలకు ముందు ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో కొత్తవారికి టిక్కెట్ ఇచ్చారు. రఘురామరాజుకు ఉండి స్థానాన్ని కేటాయించారు. అలాగే, బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల, మడకశిర స్థానం నుంచి ఎంఎస్ రాజుకు, వెంకటగిరి స్థానం నుంచి కురుగొండ్ల రామకృష్ణకు సీటు కేటాయించారు. మిగిలిన అభ్యర్థులతో కలిపి వీరికి కూడా చంద్రబాబు బీ ఫామ్స్‌ను అందచేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బీ ఫారాలు తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశాం. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు గెలవాలి... రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదం. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి... ఓటు బదిలీ జరగాలి. కొందరు వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చారు. వైసీపీ నుంచి మంచి వాళ్లను మాత్రమే టీడీపీలోకి తీసుకుని నేను సీట్లు ఇచ్చా. పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలి. 
 
ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉంది... ప్రచారానికి 20 రోజులే ఉంది. ఈ 20 రోజులు మీకు ఎంతో కీలకం. నేను ఇప్పటికే 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించాను. పలు సభలు పవన్ కళ్యాణ్ తోనూ కలిసి నిర్వహించాను. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లండి. లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరి. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే... దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడు. 
 
జగన్ బస్సుయాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారు... చీకట్లో నేను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారు. ఇందులో బొండా ఉమా ప్రమేయం ఉందని రాయి విసిరిన వ్యక్తితో చెప్పించేలా కుట్రలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేశారు... కానీ, వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని విష ప్రచారం చేశారు. 
 
జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ... తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారు. అమరావతి, పోలవరంను విధ్వంసం చేశాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. కేడర్‌తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలి. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది... మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయండి' అని చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ షాపు సెల్లార్‌లో మహిళపై అత్యాచారం.. హత్య!!