ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఓ లక్ష్యం ఉన్న నేత కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో 1000 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రధాని మోడీ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ఓ లక్ష్యం ఉన్న నాయకుడు అని కితాబిచ్చారు. మెగా మెడికల్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోందని, రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గిస్తే, దేశంలోనూ కరోనాను కట్టడి చేసినట్టేనని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తోన్న ఏపీ మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.
వైద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పనలో ఏపీ అగ్రగామిగా ఉందని, మంచి నిర్ణయాలు, మంచి కార్యక్రమాలకు ఏపీ అన్ని వేళలా కేంద్రానికి అండగా నిలుస్తోందని కొనియాడారు. విశాఖలో ఆర్ఎన్ఐఎల్ ఆధ్వర్యంలో 1000 పడకల కొవిడ్ చికిత్స కేంద్రం నిర్మాణం జరగ్గా, అందులో తొలిదశలో 300 పడకల సామర్థ్యం గల ఆసుపత్రి నేడు అందుబాటులోకి వచ్చింది.