ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో (ఆదివారం) రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశామని చెప్పుకొచ్చిన జగన్.. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉందన్నారు.
రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆదివారం జగన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామన్నారు.
ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందికి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని జగన్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, తన రెండేళ్ల పాలన ద్వారా విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా రెండేళ్ల పాలనలోనే ఆచరణలో నిరూపించినట్టు చెప్పారు. ప్రజలు ఐదేళ్లకు కదా ఓటు వేసింది.. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం ఎందుకనే గత పాలకుని వైఖరికి భిన్నంగా నవరత్నాల ద్వారా ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతంపైగా ఇప్పటికే అమలు చేసినట్టు గుర్తుచేశారు.