Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి దర్శనం రెడీరెడీ, ఎప్పుడు? ఎలా?

తిరుమల శ్రీవారి దర్శనం రెడీరెడీ, ఎప్పుడు? ఎలా?
, సోమవారం, 1 జూన్ 2020 (20:26 IST)
రెండున్నర నెలల విరామం అనంతరం మళ్ళీ తిరుమల శ్రీవారి సన్నిధి భక్తులతో కళకళలాడనుంది. తిరుమలతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు జూన్ 8న భక్తులను అనుమతించనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. 
 
దేశంలోనే ప్రముఖ ఆలయాలు ఉన్న చిత్తూరు జిల్లాలో మళ్లీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. లాక్ డౌన్ కారణంగా తిరుమల ఆలయంతో పాటు శ్రీకాళహస్తి కాణిపాకం లాంటివి ప్రముఖ దేవాలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కేంద్రం ప్రకటించిన దానికన్నా ముందే మార్చి 20వ తేదీన టిటిడి భక్తులకు నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆలయ పరిసరాలు బోసిపోయాయి.
 
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండున్నర నెలల సుదీర్ఘ కాలం కేవలం ఒక వ్యాధి కారణంగా తిరుమలకు భక్తులను నిషేధం విధించాల్సి వచ్చింది. తద్వారా శ్రీవారి భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం ఈ సమయంలో కోల్పోవడంతో పాటు టీటీడీకి కూడా వందల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టిటిడి కొన్ని రోజులుగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తిరుపతిలో విక్రయించటం మొదలుపెట్టింది. అనంతరం లడ్డూ ధర సగానికి తగ్గిస్తూ ఏపీ లోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ చెన్నై లాంటి నగరాలకు సబ్సిడీ లడ్డూలు పంపి భక్తులు తృప్తి పడేలా ఏర్పాటు చేసింది.
 
ఇక కేంద్రం నిబంధనలను అనుసరించి జూన్ 8వ తేదీ నుంచి మళ్ళీ తిరుమల ఆలయం లోనికి భక్తులకు స్వాగతం పలకనుంది. అయితే గతంలో మాదిరిగా రోజుకి లక్ష మంది భక్తులకు దర్శనం చేయించే అవకాశం లేకుండా పరిమితంగా అనుమతించనున్నారు అధికారులు. తొలుత రోజుకు పదివేల చొప్పున భక్తులు ఆన్లైన్లోనూ తిరుపతిలోని వసతి సముదాయాలు దగ్గర టోకెన్ తీసుకొని దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు.
 
అలాగే తిరుపతిలోని ప్రారంభం మార్గమైన అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం లోపల వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే క్యూలైన్లలో సామాజిక దూరం పాటించేలా రెడ్ లైన్స్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తలనీలాల సమర్పణ, అన్నప్రసాదాలు కేంద్రాల దగ్గర ఆరోగ్య నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
తిరుమలకు వెళ్లే బస్సుల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. హెల్త్ చెకప్ చేసి ఆరోగ్యంగా ఉన్న వారినే స్వామివారికి దర్శనానికి అనుమతించాలని భావిస్తున్నారు. మాస్కులు శానిటైజర్లను భక్తులే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అలా తెచ్చుకోని భక్తులకు కొండపైన వాటిని ఇచ్చేలా ఆలోచిస్తున్నారు. అలాగే స్వామివారి సేవా టికెట్లను కూడా గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండదు. సామాజిక దూరం పాటించాల్సి రావడంతో అతి తక్కువ సంఖ్యలోనే ఇకముందు సేవా టిక్కెట్లు విక్రయం జరుగుతుందని ఇప్పటికే చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
 
మొత్తంమీద లాక్డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉన్నప్పటికీ అనేక ఆంక్షల మధ్య దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలో మిగతా ప్రముఖ ఆలయాలు శ్రీకాళహస్తి, కాణిపాకం టీటీడీ అనుబంధ ఆలయం దాదాపు ఇవే చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ సూచనల మేరకు లాక్‌డౌన్ అనంతరం ఏవిధంగా దర్శనం చేస్తామని వివరాలు ఆలయ అధికారులు సమర్పించారు. 
 
ఆలయానికి వచ్చే భక్తులలో కొంతమందికి కరోనా ఉన్నా ఎక్కువమందికి విస్తరించే ప్రమాదం ఉండటంతో నియమాలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇకముందు ఆలయ దర్శన విధానాల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడనుంది. అయితే ఈ గందరగోళం మధ్య భక్తులు వస్తారో లేదోనన్న అనుమానం టిటిడి అధికారుల్లోనే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్ నిబంధనలు సడలింపు: తగ్గిన బంగారం ధరలు