తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ తర్వాత ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జూన్ 8వ తేదీన కోట్లాది మంది కొంగుబంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయాన్ని తెరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈ నేపథ్యంలో తితిదే కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు. అలిపిరి, కాలి నడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దర్శనాలను ప్రారంభిస్తామని తితిదే అధికారులు చెపుతున్నారు. భక్తులకు ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు అందజేస్తామని, దర్శనం ఉన్న భక్తులకు మాత్రమే తిరుమలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖానికి మాస్క్లను ధరించడం, చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవడం తప్పనిసరని తెలిపారు.
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు, ఆదివారం నుంచి హైదరాబాద్ నగరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించనున్నారు. హిమాయత్ నగర్‌లోని టీటీడీ కేంద్రానికి ఇప్పటికే 40 వేల లడ్డూలు చేరుకున్నాయి. స్వామివారి దర్శనాలు నిలిచిన నేపథ్యంలో లడ్డూలను అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల వ్యవధిలో 13 లక్షల లడ్డూలను అధికారులు విక్రయించారు. ఇపుడు కొత్తగా మరో 40 వేల లడ్డూలను తయారు చేసి పంపించారు.