కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు జూన్ 30వ తేదీ వరకూ కొనసాగుతాయని చెప్పింది.
కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలనూ దశల వారీగా సడలించటం జరుగుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్రాలలో ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చునని చెప్పింది.
మొదటి దశలో.. కంటైన్‌మెంట్ వెలుపల ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ను జూన్ 8వ తేదీ నుంచి తెరవటానికి అనుమతిచ్చింది.
రెండో దశలో.. స్కూళ్లు, విద్యా, శిక్షణ సంస్థలను తెరవటం మీద రాష్ట్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, భాగస్వాములతో చర్చించి జూలైలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని చెప్పింది.
మూడో దశలో.. విదేశీ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, బార్లు, పెద్ద పెద్ద రాజకీయ, మత సమావేశాలు వంటి వాటి విషయంలో.. పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్
కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా జిల్లాల అధికారులు కంటైన్‌మెంట్ జోన్ల పరిధిని నిర్ణయిస్తారు. కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ జోన్ల లోపలికి కానీ, బయటికి కానీ వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, నిత్యావసరాల సరఫరా మినహా.. వ్యక్తుల సంచారం లేకుండా ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది. కంటైన్‌మెంట్ జోన్లలో లోతుగా కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తారు. ఇంటింటికీ తనిఖీలు ఉంటాయి. కంటైన్‌మెంట్ వెలుపల కొత్త కేసులు కనిపించే అవకాశం గల బఫర్ జోన్లను రాష్ట్రాలు, యూటీలు గుర్తించవచ్చు. ఇటువంటి బఫర్ జోన్లలో జిల్లా అధికారులు అవసరమని భావించిన ఆంక్షలను విధించివచ్చు.
కంటైన్‌మెంట్ వెలుపల దశల వారీగా పునరుద్ధరణ
కంటైన్‌మెంట్ వెలుపల.. ప్రకటించిన కొన్ని కార్యకలాపాలు మినహా అన్ని కార్యకలాపాలనూ దశల వారీగా పునరుద్ధరించటం జరుగుతుంది. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు) తప్పనిసరిగా పాటించాలి.
మొదటి దశలో సడలింపులు:
2020 జూన్ 8వ తేదీ నుంచి ఈ కింది కార్యకలాపాలకు అనుమతిస్తారు.
1. ఆలయాలు, మత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను ప్రజల కోసం తెరవవచ్చు.
2. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సదుపాయాల సేవలు
3. షాపింగ్ మాల్స్
ఈ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని నివారించటానికి సామాజిక దూరం పాటించేలా చూడటానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీలను జారీ చేస్తుంది.
రెండో దశలో సడలింపులు:
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, కోచింగ్ సంస్థలు మొదలవైనవాటిని తెరుస్తారు.
రాష్ట్రాలు, యూటీలు ఆయా సంస్థల స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరపవచ్చు.
ఈ చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆధారంగా ఈ సంస్థలను పున:ప్రారంభించే అంశం మీద జూలైలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
మూడో దశలో సండలింపులు:
పరిస్థితులను మదింపు చేసిన తర్వాత.. ఈ కింది కార్యకలాపాలను పున:ప్రారంభించే అంశం మీద నిర్ణయం తీసుకోవటం జరుగుతంది.
1. కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
2. మెట్రో రైలు ప్రయాణాలు
3. సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు వంటి ప్రదేశాలు
4. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత సమావేశాలు, ఇతర పెద్ద సమావేశాలు
కోవిడ్-19 నిర్వహణ కోసం నిర్దేశించిన జాతీయ మార్గదర్శకాలను దేశమంతటా పాటించటం కొనసాగుతుంది.
దేశమంతా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది
దేశమంతటా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ.. అత్యవసర కార్యకలాపాల కోసం తప్ప వ్యక్తుల సంచారం మీద నిషేధం కొనసాగుతుంది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలు సీఆర్‌పీసీ సెక్షన్ 144 వంటి తగిన చట్ట నిబంధనల కింద ఆదేశాలు జారీ చేయవచ్చు.