కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ శుభవార్త చెప్పారు. లాక్డౌన్ సమయంలోనూ టెన్త్, 12వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించుకోవచ్చన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. అయితే.. భౌతిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ముఖ్యంగా, కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టింది.
పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.
మరోవైపు, కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన విధానపరమైన నిర్ణయాలకు కూడా మంత్రివర్గం సమ్మతం తెలిపింది.
ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల ప్యాకేజీని కేంద్రం మరింత విస్తృతపరిచింది. చిన్న పరిశ్రమలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్ గ్యారంటీ కల్పించింది. సీనియర్ సిటిజన్స్‌కి సాయం చేసే ప్రధాని మంత్రి వయ వందన యోజన పథకాన్ని మార్చి 2023 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రైతులకు కేంద్ర కేబినెట్ మరిన్ని రాయితీలు కల్పించింది. ధాన్యం నిల్వలపై పరిమితిని తొలగించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు ఆమోదం తెలిపింది. బొగ్గుగనుల వేలంపై కొత్త విధానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.