తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ బస్సులను దశలవారీగా నడిపేందుకు మొగ్గుచూపింది. ఇందులోభాగంగా, తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి.
కరోనా వైరస్ హహమ్మారిని వ్యాప్తిని నిరోధించడానికి సీఎం కేసీఆర్ మార్చి 22న లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో 57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కుతున్నాయి.
సూర్యాపేట డిపో నుంచి 78 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. 54 సీటింగ్ కెపాసిటీతో ప్రయాణికులను తీసుకువెళ్లాలని డ్రైవర్ కండక్టర్లకు సూచించారు. శ్రీశైలం మినహా అన్ని రూట్లలో బస్సులు నడపాలని డిపో అధికారులు నిర్ణయించారు. నల్లగొండ రీజియన్‌లో 400 బస్సులు రోడ్డెక్కాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్ వరకు నడుపనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని తొమ్మిది డిపోల నుంచి 761 బస్సులు రోడ్డెక్కాయి. మహబూబ్ నగర్ డిపో బస్సులు ఆరాంఘర్ వరకు రానున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీషరీఫ్ వరకు వస్తాయి.
అంతర్రాష్ట్ర బస్సులు నడపడానికి అనుమతి లేకపోవడంతో ఆ సర్వీసులను ఇతర రూట్లలో తిప్పాలని అధికారులు నిర్ణయించారు. అయితే అంతర్రాష్ట్ర రూట్లలో రద్దీని బట్టి రాష్ట్ర సరిహద్దు చివరి బస్టాండ్ వరకు బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.