బెజవాడలో రాయల వైభవం... శబ్ధ, కాంతి ప్రదర్శనతో కార్యక్రమం
విజయవాడ మరో వినూత్న కార్యక్రమానికి వేదిక కాబోతుంది. నగర ప్రజల ముంగిట అలనాటి శ్రీకృష్ణ దేవరాయల వైభవం సాక్షాత్కరించబోతుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ “సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామ్ ఆన్ శ్రీకృష్ణ దేవరాయ” పేరిట ఈ ప్రత్యేక కార్
విజయవాడ మరో వినూత్న కార్యక్రమానికి వేదిక కాబోతుంది. నగర ప్రజల ముంగిట అలనాటి శ్రీకృష్ణ దేవరాయల వైభవం సాక్షాత్కరించబోతుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ “సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామ్ ఆన్ శ్రీకృష్ణ దేవరాయ” పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రదర్శించనుండగా, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ దీనిని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగింది.
అమరావతిలో ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లపై సమావేశం చర్చించింది. ప్రాథమికంగా సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం కోసం సువిశాలమైన స్థలం కావలసి వుండగా, స్వరాజ్య మైదానంతో పాటు, సిద్ధార్ధ అకాడమీకి చెందిన స్థలాలు చర్చకు వచ్చాయి. స్ధానిక కళాకారులకు ఏడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ద్వారా వారిని సంసిద్ధులను చేసి మరో ఏడు రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహించాలన్న ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది. సందర్శకులకు ఇబ్బంది రాని విధంగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మీనా అధికారులను ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ప్రదర్శనకు అవసమైన ప్రధాన కళాకారులు పది మంది బెంగుళూరు నుండి వస్తుండగా, ఇతరత్రా అవసరమైన వంద మంది కళాకారులను స్ధానికుల నుండి ఎంపిక చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. మరోవైపు ప్రదర్శన జరుగుతున్న సమయంలో చూపరులకు ఆసక్తి కలిగించే విధంగా ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు శిల్పారామం, డ్వాక్రా సంఘాల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు.
ప్రదర్శన ప్రత్యేకతలను వివరించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, సౌండ్ అండ్ లైట్ విధానంలో ఆహుతులు స్ధిరంగానే ఉంటారని, వేదికలు మాత్రం ఒకదాని వెంబడి ఒకటిగా మారిపోతూ ఉంటాయని వివరించారు. లైటింగ్ అధారంగా జరిగే ఈ ప్రక్రియ వల్ల మన కళ్ల ముందే రాయల వైభవం జరుగుతున్న తీరు కనిపిస్తుందన్నారు. ప్రేక్షకులు కూడా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో ఉన్నట్లుగా భావిస్తారని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి విజయకుమార్ రెడ్డి తెలిపారు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ కు చెందిన జయకుమార్, మనోహర్, ఎస్‌వి సుబ్బారావులతో పాటు విజయవాడ డిప్యూటి కలెక్టర్ రవీంద్రరావు, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎం. కృష్ణానంద్, ఉప సంచాలకులు కస్తూరి తదితరులు పాల్గొన్నారు.