Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో కేసీఆర్‌, జగన్‌ సమావేశం..?

త్వరలో కేసీఆర్‌, జగన్‌ సమావేశం..?
, ఆదివారం, 7 జూన్ 2020 (18:42 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జలవివాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టే యోచనలో జగన్‌, కేసీఆర్‌ ఉన్నారని, త్వరలోనే వారు భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. వ్యక్తిగతంగానూ జగన్‌, కేసీఆర్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండటంతో విభజన సమస్యలనూ కలిసే పరిష్కరించకునేందుకు కృషి చేశారు.

నదీ జలాల విషయంలోనూ మొదట ఇరువురి మధ్యా ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సమయంలోనూ ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కొట్టొచ్చొనట్టుగానే కనిపించింది. దాదాపు ఏడాది పాటు ఏ ఒక్క విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తలేదు. 
 
ఎప్పుడైతే రాయలసీమకు నీళ్లిచ్చే దిశగా జగన్‌ పోతిరెడ్డిపాటు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచారో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.

బేసిన్లు,  బేషజాలకు పోకుండా ప్రతీనీటి బొట్టును రెండు రాష్ట్రాల రైతాంగానికి అందిద్దామని నేను అంటే..తనకు మాటమాత్రం చెప్పకుండా పోతిరెడ్డిపాడుపై ఏపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో వేడి రాజుకుంది.

కేసీఆర్‌ అసంతృప్తిపై స్పందించిన సీఎం జగన్‌ తమకు రావాల్సిన నీటి వాటానే మాత్రమే వాడుకుంటామని, అంతకు మించి ఒక్క చుక్క నీటిని కూడా కృష్ణ జలాల్లోంచి తీసుకోబోమని స్పష్టం చేశారు. 

అయితే గోదావరి నీటిని తీసుకుంటే అభ్యంతరం లేదన్న కేసీఆర్‌ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కృష్ణ జలాలను తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయా సమావేశాల్లో నదీ జలాలపై ఆచితూచి మాట్లాడారే తప్పా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు.
 
కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తింది. ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని డీపీఆర్ లు ఇవ్వాలని రెండు రాష్ట్రలను బోర్డు కోరింది. అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాను కూడా ఖరారు చేయాలని సూచించింది.

దీంతో తాజాగా  వచ్చిన జల వివాదాలపై నేరుగా చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు భావించినట్టు తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పోతిరెడ్డిపాడు వివాదం రేగిన వెంటనే ఇరువురు సీఎంలు కలవాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా పడింది.

తాజాగా అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్న నేపథ్యంలో ఇద్దరు సీఎంలు కలిసి సమస్యల్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం