జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమేనని వైయస్ కు సన్నిహితుడిగా పేరుగాంచిన గోనె ప్రకాశ్ వెల్లడించారు. 2018 క్రిస్మస్ వరకే షర్మిల పులివెందుల వెళ్లారని, జగన్ సీఎం అయ్యాక వెళ్లలేదని చెప్పారు.
2019లో జగన్ కుటుంబం మొత్తం పులివెందులకు వెళ్లినా, షర్మిల మాత్రం వెళ్లలేదని గుర్తు చేశారు. షర్మిల బెంగళూరులోనే ఉన్నారని తెలిపారు. షర్మిల కొత్త పార్టీ పెడతారని నాలుగు, ఐదు నెలల క్రితమే తాను చెప్పానని గోనె ప్రకాశ్ చెప్పారు.
షర్మిల, బ్రదర్ అనిల్ ఇద్దరూ కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేశారని తెలిపారు. గూడు కదులుతోంది అంటూ షర్మిల భర్త సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టు కొత్త పార్టీ గురించేనని అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఉపఎన్నికల కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పారు.
2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని అడిగిన వెంటనే షర్మిల ఒప్పుకున్నారని… 3 వేల కి.మీ.కు పైగా ఆమె పాదయాత్ర చేశారని తెలిపారు. ఉపఎన్నికల్లో విజయాలకు 99 శాతం షర్మిలే కారణమని అన్నారు.
2019 ఎన్నికల్లో లోక్ సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారని, ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని… చివరకు ఏదీ ఇవ్వలేదని చెప్పారు. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.
జగన్ సీఎం అయిన తర్వాత షర్మిల ఒక్కసారి కూడా గుంటూరుకు వెళ్లలేదని చెప్పారు. ఆమె భర్త అనిల్ మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందనేది కూడా తమకు తెలుసని తెలిపారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు రోడ్లపై పడి తిరిగితే, చివరకు తమను బాధలకు గురిచేశారంటూ వైయస్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని కడపకు చెందిన వీఐపీలు మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ భార్య భారతికి రాజకీయ ఆకాంక్ష ఉందని చెప్పారు.