ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ అయిన ఎయిమ్స్ - మంగళగిరిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. తిరుపతికి చెందిన ఓ జూనియర్ విద్యార్థిపై 15 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వేధింపులు భరించలేని జూనియర్ విద్యార్థి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర విద్యార్థులు బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన 15 మంది సీనియర్లపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. గత నెల 22వ తేదీన హాస్టల్‌లోని స్నేహితులతో జూనియర్ విద్యార్థి మాట్లాడుతుండగా, గదిలో ఉన్న మిగిలిన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడిన మరుసటిరోజే 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చశారు. అయితే, ఈ విషయాన్ని యాజమాన్యం అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఇదిలావుంటే, ర్యాగింగ్ ఘటనలో సస్పెండ్ అయిన 15 మంది విద్యార్థుల్లో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఎయిమ్స్‌లోని ర్యాగింగ్ నిరోధక కమిటీ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో 15 మంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో జూన్ 24వ తేదీన సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత 13 మంది విద్యార్థుల పాత్ర మాత్రమే ఉందని నిర్దారించారు. మానసికంగా కుంగిపోయిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తమ సొంతూరుకు తీసుకెళ్లారు.
కాగా, విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో ముగ్గురు సీనియర్లను యేడాదిన్నర పాటు (మూడు సెమిస్టర్లు) సస్పెండ్ చేసి, ఒక్కొక్కరికీ రూ.25 వేల అపరాధం విధించారు. మరో ఆగురురిని యేడాది పాటు (2 సెమిస్టర్లు) సస్పెండ్ చేయగా, మిగిలిన వారిని ఆరు నెలల పాటు (ఒక సెమిస్టర్) సస్పెండ్ చేశారు. వీరందరికీ రూ.25 వేల చొప్పున అపరాధం విధించడంతో పాటు హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు.