Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్లను పిరుదులపై కొడుతూ.. నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో ర్యాగింగ్.. (Video Viral)

ragging

వరుణ్

, గురువారం, 25 జులై 2024 (07:56 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టి పీడిస్తుంది. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎయిడెడ్ కాలేజీలో తాజాగా ఈ ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్ విద్యార్థులను దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. కర్రలతో పిరుదులపై విచక్షణా రహితంగా కొడుతూ పైశాచికానందం పొందుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అయితే, ఈ ర్యాగింగ్ ఫిబ్రవరి నెలలో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
నరసరావుపేటలో శ్రీ సుబ్బరాయ, నారాయణ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ర్యాగింగ్ వెలుగుచూసింది. జూనియర్ విద్యార్థులను సీనియర్లు కర్రలతో కొడుతున్నట్లున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఈ వీడియోపై నరసరావుపేట పట్టణ, గ్రామీణ సీఐలు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని తేల్చారు. 
 
ఈ కళాశాలలో ఎన్సీసీ ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇటీవల దాచేపల్లికి చెందిన ఓ తండ్రి తన కుమారుడిని చేర్పించాలని చూస్తుండగా.. అందులో ర్యాగింగ్ ఎక్కువగా ఉందని సదరు విద్యార్ధి ఈ వీడియోను తండ్రికి చూపించారు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ర్యాగింగ్ వ్యవహారం వెలుగుచూసింది.
 
ఈ వీడియోలో ఎన్సీసీ బ్యాచ్‌కు చెందిన పలువురు సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలు పెడుతున్నారు. రాత్రిపూట జూనియర్లను బయట నిల్చోబెట్టి, సీనియర్లు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచారు. ఆపై వారి రెండు మోచేతులు నేలపై పెట్టించి.. కర్రలతో పిరుదులపై విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తుంటే.. సీనియర్లు నవ్వుతూ పైశాచికానందం పొందారు. ఈ రాక్షస క్రీడకు వార్డెన్ సహకరిస్తుంటారని, ప్రిన్సిపాల్‌కు తెలిసినా అడ్డుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బయట చెబితే హాస్టల్ నుంచి వెళ్లగొడతారని బాధిత విద్యార్థులు మిన్నకుండిపోయారు. ఈ ర్యాగింగ్ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-ఛైర్‌పర్సన్‌‌గా నియమితులైన బన్సీధర్ బండి