Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుసలుకొడుతున్న కరోనా.. 160 మంది టీచర్లకు - 262 మంది విద్యార్థులకు పాజిటివ్!

Advertiesment
Coronavirus India Live Updates
, గురువారం, 5 నవంబరు 2020 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బుసలుకొడుతోంది. ఈ నెల రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించారు. అయితే, బడులు తెరిస్తే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరించారు. ఇపుడు చివరకు అదే జరిగింది. 
 
ఓ వైపు కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో పాఠశాలలను తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే మొగ్గు చూపింది. దీంతో, ఈ నెల 2వ తేదీన 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను తెరిచారు. 
 
అయితే, స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు, టీచర్లకు కరోనా పరీక్షలను నిర్వహిచడంతో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దాదాపు 262 మంది విద్యార్థులకు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలిందని పాఠశాల విద్య కమిషనర్ చిన్న వీరభద్రుడు తెలిపారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు.
 
అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తున్నామని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నవంబరు 4 రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారని... వీరిలో 262 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 
 
అంటే... కరోనా కేసుల శాతం 0.1 శాతం కంటే తక్కువేనని అన్నారు. పాఠశాలలకు వచ్చినందువల్లే వీరికి కరోనా వచ్చిందని ఆరోపించడం సరి కాదని చెప్పారు. ప్రతి తరగతి గదిలో 15 నుంచి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 9.75 లక్షలుగా ఉందని... పాఠశాలలకు హాజరైన వారు కేవలం 3.93 లక్షల మంది మాత్రమేనని చెప్పారు. 1.11 లక్షల ఉపాధ్యాయులకుగాను 99 వేల మంది హాజరయ్యారని తెలిపారు. 99 వేల మంది టీచర్లకు‌గాను 160 మందికి కరోనా వచ్చిందని చెప్పారు. 
 
విద్యార్థులు, ఉపాధ్యాయుల రక్షణ తమకు చాలా ముఖ్యమని వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి భయం వల్ల 40 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఈ భయం వల్లే వారు వారి పిల్లలను స్కూళ్లకు పంపించడం లేదని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఎథర్‌ ఎనర్జీ చార్జింగ్‌ మౌలికవసతులు ఏర్పాటు ప్రారంభం