Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ ఇచ్చార‌ట‌...

ఏపీకి ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ ఇచ్చార‌ట‌...
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:20 IST)
విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని అన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని ఆయన తెలిపారు.
 
 
 ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునఃవ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన హామీలను నెరవేర్చే బాధ్యత ఉంద‌ని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సాయపడాలని ఆర్థిక సంఘాలు, నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశార‌ని తెలిపారు.  అవశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి కింద 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చింద‌న్నారు. 
 
 
2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌ల కింద చేపట్టిన వాటికి రుణం సమకూర్చడంతోపాటు, ఆ రుణంపై వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోంద‌ని తెలిపారు. ఆ విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ 19,846 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. అలాగే వివిధ ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులను అనుసరించి 2015-20 మధ్య కాలానికి రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద 22,112 కోట్ల రూపాయలు, 2020-21లో 5,897 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు: జనవరికి 4కి వాయిదా