Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఏపీలో మద్యం విక్రయాలు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఏపీలో మద్యం విక్రయాలు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
, బుధవారం, 6 మే 2020 (20:18 IST)
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతులిచ్చినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి తెలిపారు.

సచివాలయం నాల్గవ బ్లాక్ లోని తన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచినట్లే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు.

ఈ అంశంపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితం అన్నారు.  రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచే అంశంలో కొందరు మహిళల నుండి వ్యక్తమవుతున్న ఆందోళనలు ఎంతమాత్రం నిజం కాదన్నారు. వారంతా కొందరు పనిగట్టుకొని రెచ్చగొడుతున్న వ్యక్తులే అని ఆరోపించారు.  
 
తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేదం అమలు చేసి తీరుతామని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణలో భాగంగా మద్యం జోలికి వెళ్ళాలంటే షాక్ తగిలే ధరలను 75 శాతం పెంచడం జరిగిందన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా 70 శాతం మేర మద్యం ధరలను అక్కడి ప్రభుత్వాలు పెంచాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వ హయాంలోని 43 వేల బెల్ట్  షాపులను తొలగించారన్నారు.

అదే విధంగా ప్రతీ ఏటా 20శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వాటితో పాటు ప్రతీ ఏటా 25శాతం మద్యం ధరలు పెంచుకుంటూ పోతున్నామని తెలిపారు. 
 
రాష్ట్రంలో ఎక్కడా బార్ షాపులను తెరవలేదని మంత్రి స్పష్టం చేశారు. మద్యం ధరలను పెంచుకుంటూ పోవడం ద్వారా పేదలు వాటి జోలికి పోకుండా ఉంటారన్న నమ్మకం ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు మంత్రి  తెలిపారు.

నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే అమ్మఒడి, రైతుభరోసా, విద్యావసతి దీవెన, సున్నా వడ్డీకే మహిళలకు రుణాల పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అదే విధంగా చేనేతలకు, మత్స్యకారులకు, మహిళలకు ఆర్థికసాయం అందించే పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు.

పెండింగ్ లో ఉన్న పలు బకాయిలు తీర్చామన్నారు. కరోనా లాంటి క్లిష్ట విపత్తు సమయంలో ప్రజలకు అదనపు రేషన్ అందించామన్నారు. ఈ సందర్భంగా గతంలో కీర్తిశేషులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మద్య నిషేదం అమలు చేసిన వైనాన్ని డిప్యూటి సిఎం నారాయణ స్వామి గుర్తుచేశారు.

ఆ తరువాత అధికారం చేపట్టిన ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కలిసి తమకు ఏం చేయకపోయినా మద్యపాన నిషేధం చేస్తే చాలని విన్నవించడంతో దశల వారీగా మద్యనిషేదం అమలు చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకొంటున్న ప్రజానాయకుడు జగన్ అన్నారు.

మహిళలకు ఇచ్చిన మాట జగన్ తప్పరని నారాయణస్వామి తెలిపారు. మద్యపాన నిషేధానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. జే ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం తమ ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. షాపుల ముందు ఎక్కువ మంది ఉంటే షాపులు మూసేయడానికి వెనకాడబోమన్నారు. పేదవాళ్లు బాగుపడాలన్నదే జగన్ లక్ష్యమన్నారు.

సంపాదించిన సొమ్మంతా తాగడానికి కాకుండా కుటుంబానికి ఖర్చుపెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా మద్యం రేట్లు పెంచారన్నారు. వినియోగదారుల సంఖ్య తగ్గించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే ముఖ్యమంత్రి  దృక్పథమన్నారు.

మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదన్నారు. ఐడీ, ఎన్డీపీ, గంజాయి, గుట్కాల నిషేధం బాధ్యత ఎస్పీల భుజాన వేశామన్నారు. మద్యం అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. 
 
ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు మద్యపాన నిషేధానికి తమ వంతుగా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు. అంతేతప్ప రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అన్ని కులాలు, మతాలు, వర్గాల వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు.

దేవుడు దీవించాడు.. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే తనకు సేవ చేసే అవకాశం దొరికిందని ముఖ్యమంత్రి నమ్ముతారన్నారు. ప్రతి పేదవాడు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్య్శమన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి పక్షానే ఉన్నారన్న విషయం గ్రహించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఉపాధి కోల్పోయిన వారి కోసం అత్యవసర నిధి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి