మద్యం అక్రమంగా విక్రయాలకు పాల్పడినా, అలాంటి వారికి అధికారులు సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హెచ్చరించారు.
అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొన్ని చోట్ల మద్యం అక్రమాలలో ప్రమేయం ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు.
శాఖాపరమైన విచారణ చేసి తొలగించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయము లో మద్యపాన నిషేధం అమలు చేయడం వలన నవరత్నాలలోని దశలవారీగా మద్యపాన నిషేదమును భవిష్యత్తులో అమలుపరచడానికి చక్కటి అనుభవముగా ఉపయోగపడుతుందన్నారు.
కనుక ఎక్సైజ్ అధికారులంతా నిబద్దత తో పనిచేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రము లో అన్ని బార్లలో స్టాక్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. మద్యం అక్రమాల వెనుక ఉన్నవారి పై పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టిస్తామన్నారు.
లాక్ డౌన్ కాలం లో నిత్యావసరాలకు ఇబ్బందులు పడకూడదని డిపోల్లో పని చేసే హమాలీ లకు రూ. 5000 అడ్వాన్సు ఇస్తున్నామన్నారు. ఐడీ, ఎన్డీపీఎల్ అక్రమాలలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలను నిపివేసే ఆలోచన కూడా చేస్తామని హెచ్చరించారు.