లాక్‌డౌన్ కారణంగా వివిధ రంగాలపై ఆధారపడి పని చేసేవారు తమ ఉపాధి కోల్పోవడంతో అవస్థలు పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కుల వృత్తి చేసుకునే క్షురకులు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, స్వయం ఉపాధి కింద పని చేసుకునే బైక్ మెకానిక్ లు, ఎలక్ట్రిక్ పనులు చేసుకునేవారు, హాకర్లు, చిన్నపాటి టిఫిన్ బండ్లు నిర్వహించుకునే వారు ఆర్థికంగా దెబ్బతిన్నారని అన్నారు.
వీళ్లందరికి రూ.5 వేలకు తక్కువ కాకుండా ఆర్థికసాయం అందజేయాలని కోరారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వంరూ.1610 కోట్లతో ఒక అత్యవసర నిధి ఏర్పాటు చేసిందని తెలిపింది. ఏపీలో కూడా ఇటువంటి నిధి ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, చిరు వ్యాపారులు, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికి విద్యుత్ బిల్లుల విషయం కొన్ని నెలల పాటు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఆస్తి, వృత్తి పన్నుల వసూలు మినహాయింపు ఇవ్వాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.