Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమిష్టి పోరుతోనే కరోనాపై విజయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

సమిష్టి పోరుతోనే కరోనాపై విజయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
, శనివారం, 21 మార్చి 2020 (08:46 IST)
కరోనా వైరస్ (కొవిడ్19) వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాలలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని గవర్నర్ సూచించారు.

జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిన ఏవరైనా తమ చేతులను పారిశుధ్య ద్రావకంతో (శానిటైజర్) తరచుగా శుభ్రం చేసుకోవాలని,  ముసుగుతో ముఖాన్ని కప్పి ఉంచుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరం అత్యావశ్యకమైన అంశమన్న గవర్నర్, 10మందికి పైగా గుమికూడకుండా ఉండాలని, తమ నివాసాలలోని వృద్దుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. 

కరోనా లక్షణాలు కనిపిస్తే, భయపడకుండా కాల్ సెంటర్‌ను సంప్రదించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోని వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలన్నారు. సాధారణ స్ధితికి పరిస్థితి చేరే వరకు ఎప్పటికప్పుడు అధికారుల సలహాను అనుసరించి వ్యవహరించాలని, రద్దీగా ఉండే మత పరమైనర ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని బిశ్వ భూషణ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 

అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే కాకుండా సమిష్టి పోరాటం ద్వారానే కరోనావైరస్ కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో విజయం సాధించ గలుగుతామని  గౌరవ హరిచందన్ పేర్కొన్నారు. మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కదిలి రావలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కు సిద్దంగా ఉండాలని బిశ్వభూషణ్ ఆకాంక్షించారు.
 
నెలాఖరు వరకు పర్యటనల రద్దు 
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగులతో సహా రాజ్ భవన్ లో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది థర్మల్, నాన్-టచ్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ల ద్వారా స్కానింగ్  చేస్తున్నారని తెలిపారు.

రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి శానిటైజర్స్, ముసుగులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. అధిక ఉష్ణోగ్రత, ఫ్లూ వంటి లక్షణాలతో కనిపించే వారు తక్షణమే వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకోవలసి ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగులు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, జ్వరం, జలుబు లక్షణాలతో అనారోగ్యంగా ఉంటే వారికి తక్షణమే సెలవు మంజూరు చేసేలా ఆదేశించామన్నారు.

మరోవైపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను వాయిదా వేసేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సైతం ఈ నెలాఖరు వరకు తన పర్యటనలను రద్దు చేసుకున్నారని, రాజ్యాంగ బద్ద మైన వ్యవస్ధలకు చెందిన వారిని మినహా, దశల వారిగా సందర్శకుల ప్రవేశంపై కూడా అంక్షలు అమలు చేయనున్నామని మీనా తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా కర్ఫ్యూకు మోడీ పిలుపు... దేశంలో రైళ్ళ నిలిపివేత