విశాఖలో తొలి కరోనా కేసు... అధికారుల హైఅలెర్ట్

శుక్రవారం, 20 మార్చి 2020 (15:00 IST)
విశాఖపట్టణంలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థాని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి వైరస్ సోకినట్టు వైద్యులు తేల్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మూడు కరోనా కేసులు నమోదైనట్టయింది. విశాఖ కరోనా వైరస్ బాధితుడిని చెస్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు. నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడటంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 
 
అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్దుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. 
 
ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కి పంపించారు. గురువారం అక్కడి నుంచి నివేదిక రాగా వృద్దుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్నప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. 
 
ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. అదేసమయంలో వృద్దుడి నివాసిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. 
 
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశ వర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్.. మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ