జనతా కర్ఫ్యూకు మోడీ పిలుపు... దేశంలో రైళ్ళ నిలిపివేత

శనివారం, 21 మార్చి 2020 (07:58 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు.. మన దేశంలో కూడా శరవేంగా విస్తరిస్తోంది. ఆరంభంలో అతి తక్కువ మందికి సోకిన ఈ వైరస్.. ఒకటి రెండు రోజుల్లోనే డబుల్ సెంచరీ కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించకుండా అడ్డుకట్ట వేయడానికి కేంద్రం ఓ సంకల్పంతో పని చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 22వ తేదీన దేశ వ్యాప్త జనతా కర్ఫ్యూకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ ఆదివార ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. అంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే ప్రజలందరూ 14 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని నరేంద్ర మోడీ సూచించారు. 
 
ఈ కార్యక్రమానికి తమవంతు సహకారంగా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లను, ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను అందుకు మినహాయించారు.
 
కాగా, రైల్వే శాఖ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 2,400 రైళ్లు నిలిచిపోతాయి. ఇప్పటికే రైల్వే శాఖ 200 రైళ్లను రద్దు చేయగా, రూ.450 కోట్ల మేర నష్టం చవిచూసింది. రైలు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఈ నష్టం మరింత తీవ్రతరం కానుందని అంచనా!

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్ సోకితే రోగిలో సరికొత్త వ్యాధి లక్షణాలు.. ఏంటవి?