కరోనా వైరస్ విజృంభణ : తెలంగాణాలో టెన్త్ పరీక్షలు వాయిదా

శుక్రవారం, 20 మార్చి 2020 (16:13 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీ షెడ్యూల్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
 
రాష్ట్రంలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అత్యవసర వ్యాజ్యంగా భావించిన ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పవన్‌ కుమార్‌ వాదించారు. విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితులు ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని లేదా పటిష్టర్పాట్లు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సోమవారం నుంచి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆంధ్రా ఎస్ఈసీకి పూర్తి భద్రత కల్పిస్తాం: మంత్రి కిషన్‌ రెడ్డి