ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే 75 దేశాల్లో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. మన దేశంలో కూడా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
మంకీపాక్స్ వైరస్ సోకినవారితో పాటు వారికి సన్నిహితంగా ఉన్నవారు కూడా కొన్ని రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారితో పాటు వారితో మాట్లాడినవారు, కలిసి భోజనం చేసినవారు కూడా జాగ్రత్తలు పాటించాలి.
ఈ వైరస్ సోకినవారు ఖచ్చితంగా 21 రోజుల పాటుగానీ, వారి శరీరంపై అయిన దద్దుర్లు లేదా పుండ్లు పూర్తిగా తగ్గిపోయే వరకు గానీ ఐసోలేషన్‌లో ఉండాలి.
వైరస్ సోకినవారితో సన్నిహితంగా ఉండేవారు మూడు పొరల మాస్క్‌ను ముఖానికి ధరించాలి.
ఈ వైరస్ సోకినవారు లేదా సన్నిహితంగా ఉన్నవారు కూడా కొంతకాలం పాటు రక్తదానం చేయరాదు.
మంకీపాక్స్ వైరస్ సోకినవారికి వైద్య సేవలు అందించిన వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బంది కూడా 21 రోజుల పాటు ప్రత్యేక పరిశీలనలో ఉండాలి. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుంటే తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహించవచ్చు. ఏవేని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఐసోలేషన్‍లో ఉండాలి.
మంకీపాక్స్ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా, ఇది ప్రాణాపాయం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యం చేయించుకుంటే మాత్రం కొద్ది రోజుల్లోనే కోలుకుని రోజువారీ జీవతం గడపవచ్చని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.