కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాలకులను అనారోగ్యం వెంటాడుతోంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేన్సర్ బారినపడ్డారు. ఈ వార్తల నుంచి బీజేపీ శ్రేణులు తేరుకోకముందే బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'ఆ ఈశ్వరుడి కృప, మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే కోరుకుంటా'.. అని అమిత్‌షా ట్వీట్ చేశారు.
మరోవైపు, 66 యేళ్ళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఇది మృదుకణజాల కేన్సర్. ఫలితంగా ఆయనకు తొడ భాగంలో కణితి ఏర్పడింది. ఈ కారణంగా ఆయన రెండు వారాల పాటు సెలవు తీసుకున్నట్టు సమాచారం. ఈ సమయంలో ఆయన న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకోనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
నిజానికి అరుణ్ జైట్లీ గత యేడాది మూత్రపిండ మార్పిడి చేయించుకున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు కేన్సర్‌కు కీమోథెరపీ ఇస్తూ, శస్త్రచికిత్స కూడా చేస్తే ఆ భారాన్ని ఆయన మూత్రపిండాలు తట్టుకోలేవని.. దీనివల్ల ఇతరత్రా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అక్కడి వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయకపోవచ్చని, కొన్ని మందులు మాత్రం ఇచ్చి తగు జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేయవచ్చని సంబంధిత వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే, గత ఐదేళ్ళ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు తీవ్ర అనారోగ్యాల బారినపడ్డారు. వీరిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఈమెకు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ కూడా క్లోమ కేన్సర్ బారినపడి నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొందారు.
అలాగే, కేంద్ర రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వర్తించిన అనంత్‌కుమార్ ఊపిరితిత్తుల కేన్సర్‌తో గత ఏడాది కన్నుమూశారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే హృద్రోగంతో 2017లో తుదిశ్వాస విడిచారు. ఇపుడు అరుణ్ జైట్లీ కేన్సర్ వ్యాధి బారినపడ్డారు.