నటీనటులుః అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సివిఎల్., దేవీప్రసాద్, ప్రియదర్శి, ప్రవీణ్ తదితరులు
సాంకేతికతః సినిమాటోగ్రణీః సిద్, సంగీతంః శ్రీచక్ర పాకాల, నిర్మాతః సతీష్ వేగేశ్న, దర్శకత్వంః విజయ్ కనకమేడల.
అల్లరి నరేష్ సినిమాలంటే ఏముంది.. అబ్బ.. ఏదో అల్లరి చిల్లరిగా చేస్తాడు. సరే ఏదో కొత్తగా చేశానంటున్నాడు. ఒక్కసారి చూసొద్దాం అని అందరికీ అనిపిస్తుంది. ఈసారి అలాకాదు కొత్తగా చేశాను అంటూ ఆయనే స్టేట్‌మెంట్ ఇచ్చాక.. చూద్దాం. ఏం ఇరగతీశాడో అని అందరికీ అనిపిస్తుంది. పైగా నాంది టైటిల్‌కూడా ఇకపై ఇలాంటి సినిమాలకు నాంది పలుకుందని కూడా చెప్పాడు. మరి ఆయన చెప్పిన మాటలు పక్కన పెడితే ప్రేక్షకుడికి ఎలా అనిపించిందో చూద్దాం. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథగా చెప్పాలంటే,
సూర్య (అల్లరి నరేష్)ది మధ్యతరగతి జీవితం. తల్లి, తండ్రి కొడుకు బాగుకోసం కొన్ని త్యాగాలు చేసే కుటుంబం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతోపాటు పెండ్లికూడా కుదురుతుంది సూర్యకు. ఇల్లు కూడా అప్పుచేసి కొని అందరినీ ఆశ్చర్యపరుద్దామనుకుంటాడు. కట్‌చేస్తే, కానీ, తనే ఆశ్చర్యపరిచేలా విధి చేస్తుంది. సి.ఐ. షడెన్‌గా వచ్చి సూర్యను హత్య కేసులో అరెస్ట్‌చేస్తాడు. చనిపోయిన వ్యక్తి పౌరహక్కుల సంఘాల నాయకుడు.
సూర్యపై సాక్ష్యాలు కూడా సృష్టించి రకరకాలుగా హింసించి చివరికి 14రోజులు రిమాండ్ ఖైదీగా చర్లపల్లికి పంపిస్తాడు. ఐదేళ్ళు గడిపోతుంది. షడెన్ లాయర్ వరలక్ష్మి వచ్చి బెయిల్ ఇప్పిస్తుంది. కానీ ఈలోగా లోపల జరిగిన గొడవల వల్ల బెయిల్ కాన్సిల్ అవుతుంది. ఇదే లాయర్‌కు కావాల్సింది. మరి అంతగా లాయర్ ఎందుకు అలా చేసింది? చివరికి సూర్య ఏమయ్యాడు? నాంది అనేదానికి అర్థం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణః
ఈ సినిమాకు ప్రధాన బలం కథ. దానికి తగిన నటుడు నరేష్ ఎంపిక కావడం. ఇప్పటివరకు తనకు తోచినట్లుగా పాత్రలు చేస్తే, నాందిలోని సూర్య పాత్ర నచ్చి చేశాడు. పోలీసు వ్యవస్థ, లాయర్ వ్యవస్థలో జరుగుతున్న లోటుపాటుల్ని ఎత్తి చూపేవిధంగా సినిమా వుంది. నరేష్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సగటు మనిషిని కేసులో ఇరికిస్తే పడే బాధ, ఏమీ చేయలేని నిస్సాహయత, మరోవైపు తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ అనే ఎమోషన్స్ ఇందులో చక్కగా అందరూ పండించారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర సర్ప్రైజ్ చేసింది. న్యాయం కోసం పోరాడే పాత్ర. ఆ పాత్రను హుందాగా పోషించింది. వీరితోపాటు ప్రియదర్శి, కమేడియన్ ప్రవీన్ పాత్రలు కీలకం. వారి పాత్రలు బాగా పోషించారు.
కథనంలో సూర్యకు జరిగే అన్యాయానికి ఏదైనా చేయాలనే తపన చూసే ప్రేక్షకుడిలో కలుగుతుంది. దర్శకడు అంతలా ఇన్‌వాల్వ్ చేశాడు. పోలీసు వ్యవస్థలో ఎంతటి క్రూరులు వుంటారో, అంతే ఇదిగా లాయర్లు వారి తొత్తులుగా పనిచేస్తారో, వీరిద్దరూ కలిసి అవినీతిపరుడైన రాజకీయనాయకుడికి ఎంతగా గులాంలు అవుతారనే కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇందుకు సన్నివేశపరంగా సంభాషణలు అబ్బూరిరవి రాశాడు. `అగ్ని ఆర్పివేయడానికి నీరు సృష్టించినట్లే, మనలోని దానివున్న వేదన, బాధనను ఆర్పేయడానికి కన్నీళ్ళు సృష్టించాడు. వంటి కొన్ని సంభాషణలు. `న్యాయవ్యవస్థను కూడా రాజకీయ నాయకులు శాసిస్తే మరి న్యాయ వ్యవస్థకు అర్థం ఏముంది. అంటూ జడ్జితో పలికే డైలాగ్‌లు ఆలోచింపజేస్తాయి.
ఇక సగటు మనిషి చేయని తప్పుకు పోలీసు వ్యవస్థ శిక్షవేస్తే, మరి తప్పుచేసిన పోలీసు వ్యవస్థను ప్రశ్నించే నాథుడే లేడా? ఎన్నో ఏళ్ళుగా ఇలా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యంలేక జీవితంలో కాంప్రమైజ్ పడుతున్నాడు సగటు జీవి. ఆ సగటు జీవికే కొండంత బలం సెక్షన్-211 అనేది. దానిపై పోలీసు వ్యవస్థపై పోరాడితే ఎలా వుంటుంది అన్నదే సినిమా. బహుశా ఈ సెక్షన్ వున్నట్లు కొందరికే తెలుసు. ప్రజలకు తెలీదు. అలా మన పాలకులు చేశారు. అలా కాకూడదని ప్రశ్నించే సినిమా ఇది. ఈ సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలను, హీరోను అభినందించాల్సిందే. అన్యాయానికి ఏళ్ళ తరబడి బలైపోయిన ఎంతో మంది ఖైదీల జీవిత చరిత్రలో నాంది అనేది ఒక కథ మాత్రమే.
ఇలాంటి సినిమాలు గతంలో వున్నాయి. కానీ ఇలా సెక్షన్ పేరుతో సినిమా రాలేదు. 1992లో సి. ఉమామహేశ్వరావు దర్శకత్వంలో ఓంపురి నటించిన `అంకురం` కూడా ఇంచుమించు ఇలాంటిదే. కానీ నేపథ్యాలు వేరు. పోలీసు వ్యవస్థ అప్పటికీ ఇప్పటికీ ఏమా త్రం మారలేదనేది అర్థమవుతుంది. అంకురంలో ముగింపు సన్నివేశంలో ఓంపురి పాత్ర నిజాలు చెప్పి కోర్టులో చనిపోతుంది. నాందిలో కొన ఊపిరితో కోర్టుకువరకు వస్తాడు సూర్య.
ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాక్ష్యాధారాలతో లాయర్ వరలక్ష్మి నిరూపించి దోషులకు తగిన శిక్ష వేసేలా చేస్తుంది. అదే సినిమాకు హైలైట్. ట్రాయ్ నుంచి కూడా ఎలా నిజాలు రాబట్టవచ్చనేది కూడా బాగా చూపించారు. ఏది ఏమైనా సినిమాటిక్‌గా కొన్ని సన్నివేశాలు పెట్టినా, ఫైనల్‌గా తప్పుచేయనివాడు అనవసరంగా శిక్ష అనుభవిస్తే అందుకు ఓ సెక్షన్ వుందంటూ తెలిసేలా చేసిన గొప్ప చిత్రం. అంకురంకు జాతీయ అవార్దు వచ్చింది. మరి నాంది సినిమాకూ ఎటువంటి అవార్డు వస్తుందో చూడాలి.