Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సినిమాలో లీన‌మైపోతే ఓకే.. లేదంటే అసహనమే' : "భరత్ అనే నేను" మూవీ రివ్యూ

భ‌ర‌త్ రామ్ (మహేష్ బాబు) ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తుంటాడు. ఈయన తండ్రి రాఘ‌వ‌రాజు(శ‌ర‌త్ కుమార్‌). ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. తండ్రి మృతివార్త తెలుసుకున్న భరత్ స్వదేశానికి వస్తా

Advertiesment
'సినిమాలో లీన‌మైపోతే ఓకే.. లేదంటే అసహనమే' :
, శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (13:25 IST)
చిత్రం : భరత్ అనే నేను 
విడుదల : శుక్రవారం, 2018 ఏప్రిల్ 20. 
నిర్మాణ సంస్థ‌: డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. 
తారాగ‌ణం: మ‌హేష్ బాబు‌, కైరా అద్వానీ, ప్ర‌కాశ్‌రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేశ్‌, సూర్య‌, జీవా, తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌.  
నిర్మాత‌: దాన‌య్య డి.వి.వి. 
ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం అంటేనే ప్రేక్షకుల్లోనే కాకుండా ఫిల్మ్ ట్రేడ్ వర్గాల్లో కూడా అమితాసక్తి నెలకొంటుంది. అదీ డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రం "శ్రీమంతుడు" ఎంతటి ఘన విజయం సాధించో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంతేనా.. ఈ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని అనేక పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇపుడు మరోమారు వీరిద్దరి కాంబినేషన్‌లో "భరత్ అనే నేను" చిత్రం వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అదీకాకుండా ఈ సినిమాలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా న‌టించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
 
క‌థ: 
భ‌ర‌త్ రామ్ (మహేష్ బాబు) ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తుంటాడు. ఈయన తండ్రి రాఘ‌వ‌రాజు(శ‌ర‌త్ కుమార్‌). ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. తండ్రి మృతివార్త తెలుసుకున్న భరత్ స్వదేశానికి వస్తాడు. రాఘ‌వ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కాల‌నే దానిపై సంశ‌యం ఏర్ప‌డుతుంది. పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఒక్కసారిగా తెరపైకి వస్తాయి. అప్పుడు నానాజీ అలియాస్ వ‌ర‌ద‌రాజులు(ప్రకాశ్ రాజ్‌) కల్పించుకుని భ‌ర‌త్‌ని ముఖ్య‌మంత్రిని చేస్తాడు. ముఖ్య‌మంత్రి అయిన తొలి రోజు నుండే భ‌ర‌త్ ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నుకుంటాడు. అందులోభాగంగా వారికి వ్య‌తిరేకంగా కూడా కొన్ని ప‌నులు చేస్తాడు కూడా. అయినా కూడా ప్ర‌జ‌ల మంచి కోస‌మే కాబ‌ట్టి అంద‌రూ భ‌ర‌త్‌ను అర్థం చేసుకుంటారు.
 
ముఖ్యంగా అర్హులకు ఉచిత విద్య, వ్య‌వ‌సాయ‌దారులు కోసం స‌దుపాయాలు.. ప్ర‌తి ప‌క్ష‌నేత కుమారుడిని అవినీతి కేసులో అరెస్టు చేయించ‌డం.. లోక‌ల్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తాడు. దాంతో అంద‌రూ ప్ర‌జ‌ల్లో భ‌ర‌త్ రామ్‌కి పేరు ప్ర‌తిష్ట‌లు వ‌చ్చేస్తాయ‌. ఈ క్ర‌మంలో త‌న సొంత న‌వోద‌యం పార్టీ నేత‌ల నుండి విమ‌ర్శ‌లు వ‌చ్చినా భ‌ర‌త్ ప‌ట్టించుకోడు. ఈ క్ర‌మంలో వ‌సుమ‌తి(కైరా అద్వానీ)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల భ‌ర‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వస్తుంది. పదవికి రాజీనామా చేయాల్సిన కారణాలు ఏంటి? అస‌లు భ‌ర‌త్ తండ్రి మ‌ర‌ణం వెనుకున్న ర‌హ‌స్య‌మేంటి? అనే విషయాలను వెండితెరపైనే చూసి తెలుసుకోవాల్సిందే. 
 
విశ్లేష‌ణ‌: 
ముఖ్యమంత్రి అన‌గానే ఈ జ‌న‌రేష‌న్‌కి ముఖ్యంగా శంకర్ - అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఒకే ఒక్క‌డు' చిత్రం గుర్తుకొస్తుంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం శేఖర్ కమ్ముల - రానా దగ్గుబాటి కాంబినేషన్‌లోవచ్చిన 'లీడ‌ర్' చిత్రం జ్ఞప్తికి వస్తుంది. 'భ‌ర‌త్ అనే నేను' కూడా ఈ రెండు చిత్రాల‌ను త‌ల‌పించింది. ఎవ‌రి ఆలోచ‌న‌ల‌నూ స్వీక‌రించ‌కుండా, ఉన్న‌ఫళాన ముఖ్యమంత్రి అయిన వ్య‌క్తి స‌మాజాన్ని బాగు చేసిన తీరు ఈ చిత్రంలో చూపించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా ఉంటే బాగుండేది, పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ‌మే మంచి విద్య‌ను ఇస్తే బాగుండు, చ‌క్క‌టి వైద్యం అందితే బాగుండు, ప్ర‌తి చిన్న‌దానికీ ఎవ‌రినో ఎదురుచూడ‌కుండా మ‌నంత‌ట మ‌న‌మే అన్నీ స‌మ‌కూర్చుకునేలా ఉంటే బావుణ్ణు అనేది స‌గ‌టు వ్య‌క్తుల్లో ఉండే అభిప్రాయ‌మే. 
 
ఆ విష‌యాన్నే ఈ చిత్రంలోనూ దర్శకుడు కొర‌టాల శివ చూపించారు. ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా, ఎక్క‌డా ట్విస్టులు లేకుండా స్ట్రెయిట్ నెరేష‌న్‌తో సీఎం అయిన ఓ నాయ‌కుడి వార‌సుడి క‌థ‌ని చెప్పారు. నాయ‌కులు లేని సమాజాన్ని రూపొందించ‌డ‌మే ఉత్త‌మ నాయ‌కుడి ల‌క్ష‌ణం అనే అంశాన్ని, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాల‌నే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ ఇది. చూసినంత సేపు బావుంది. ఎక్క‌డా కామెడీ పెట్ట‌డానికి వీల్లేని చిత్రం. 
 
సినిమా ఓపెనింగ్ పాట‌, జాత‌ర‌ పాట‌, వ‌చ్చాడే పాట మెప్పిస్తాయి. మిగిలిన‌వ‌న్నీ రీ-రికార్డింగ్‌లో భాగంగా వినిపిస్తాయి. సినిమాలో కామెడీ లేదు, ప్రేమ స‌న్నివేశాలు స‌రిగా పండ‌లేదు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. కౌముది పాత్ర ఓ మాజీ సీఎం కూతురిలాగా ఎక్క‌డా అనిపించ‌దు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉంది. సినిమాలో లీన‌మైపోతే త‌ప్ప సీట్ల‌లో అస‌హ‌నంగా క‌ద‌లాల్సిందే. మ‌హేశ్‌బాబులాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరోతో ఇలాంటి స్క్రిప్ట్‌లో పాట‌లు, ఫైట్లు చేయించినందుకు కొర‌టాల శివ‌ను మెచ్చుకోవాల్సిందే. 
 
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, హీరో మ‌హేష్ బాబు న‌ట‌న పాత్ర చిత్రీక‌ర‌ణ‌, క‌థాంశం, క‌థ‌లోని ఇన్‌టెన్ష‌న్‌, సామాజిక అంశాల‌ను స్పృశించ‌డం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, కెమెరా, చిత్ర నిర్మాణపు విలువలు అదనపు బలాన్ని చేకూర్చి పెడతాయి. అలాగే, మైన‌స్ పాయింట్స్‌ను పరిశీలిస్తే, ప్రీ క్లైమాక్స్ త‌ర్వాత సినిమా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో సాగడం, క‌థ‌కు సంబంధం లేని పాట‌లు మధ్యమధ్యలో రావడం, కామెడీ క‌థ‌లో భాగంగా కూడా లేక‌పోవ‌డం, ముఖ్యమంత్రిగా హీరో తీసుకునే చర్యలన్నీ వాస్తవానికి దూరంగా ఉండటం. మొత్తంమీద భరత్ అనే నేను అనే చిత్రాన్ని ఇన్‌టెన్ష‌న‌ల్ పొలిటిక‌ల్ డ్రామాగా చెప్పొచ్చు. వీడియో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాలేక పోతున్నా... ఎప్పటికీ పవన్ వెంటే : ట్వీట్ చేసిన హీరో నితిన్