సుప్రసిద్ధ గాయనీమణి వాణీ జయరాం (78) మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని చెన్నై నగర పోలీసులు స్పష్టంచేశారు. ఆమె పడక గదిలో కిందపడటం వల్లే తలకు బలమైన గాయం తగిలి ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అలాగే, వాణీ జయరాం ఇల్లు అపార్టుమెంటులోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలించామని ఎక్కడా కూడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని వారు తెలిపారు. అలాగే, వాణీ జయరాం ఇంటిని చెన్నై నగర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు, వాణీ జయరాం తన పెళ్ళి రోజే చనిపోయారు. 1968 ఫిబ్రవరి 4వ తేదీన ఆమె జయరాంను వివాహం చేసుకున్నారు. అదే రోజున ఆమె తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కాగా, వాణీ జయరాం మృతిపై చెన్నై థౌజండ్ లైట్ పోలీసుల కేసు నమోదు చేసివున్న విషయం తెల్సిందే.