తెలుగులో అలనాటి తార సావిత్రి బయోపిక్ ''మహానటి'' హిట్ కొట్టడంతో.. తాజాగా పలు బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖుల వాస్తవ జీవితాల ఆధారంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, గోపీచంద్, కె. విశ్వనాథ్ ఇలా వరుస చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని క్రిష్ రెండు భాగాలుగా విడుదల చేస్తుంటే.. ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా మొదలెట్టేశారు. ఎన్నికల ముందు రూపుదిద్దుకుంటున్న ఈ బయోపిక్ మూవీలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సందర్భంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ మూవీ తెరపైకి వచ్చింది.
తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీకి ముహూర్తం ఖరారైంది. తొలుత ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పోషిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇటీవల కేసీఆర్ జీవిత్ర చరిత్ర ఆధారంగా ''తెలంగాణ దేవుడు'' అనే సినిమాను లాంచ్ చేశారు.
ఈ సినిమాలో కేసీఆర్‌గా హీరో శ్రీకాంత్ నటిస్తున్నారనేది తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉండగా.. కేసీఆర్ పాత్ర కోసం శ్రీకాంత్ మేకోవర్ మొదలు పెట్టారని టాక్ వస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ప్రసంగాలను వినేపనిలో శ్రీకాంత్ వున్నారని తెలిసింది. నూతన దర్శకుడు హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. నటుడు, రచయిత రచనా సహకారం అందిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో భూస్వామిగా కీలకపాత్రలో కనిపిస్తున్నారు.
మరోవైపు ''ఆపరేషన్ 2019'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాలే గాకుండా టాలీవుడ్‌లో దాదాపు అర్థ శతకానికి మించిన సినిమాలు చేసిన శ్రీకాంత్.. తాజాగా ఆపరేషన్ 2019 అనే పొలిటికల్ జానర్ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''ఆపరేషన్ 2019'' అనే టైటిల్‌తో కూడిన ఈ సినిమాకు ''బివేర్ ఆఫ్ పబ్లిక్'' అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి సంబంధించి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని సినీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ని బట్టి చూస్తే.. ఆపరేషన్ దుర్యోధనను మించిన పొలిటికల్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఈసారి కూడా సీరియస్ రాజకీయ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ దుమ్ముదులిపేలా వున్నారు.