మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరి నుంచి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తప్పుకున్నారు. ఈ నెల 10వ తేదీన జరుగనున్న "మా" ఎన్నికల్లో బండ్ల గణేష్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేశారు. అయితే, ఆయన శుక్రవారం ఉన్నట్టుండి తన నామినేషన్ పత్రాన్ని విత్ డ్రా చేసుకున్నారు.
'నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను' అని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఇదిలావుంటే, ఈసారి మా అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు మా జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీ చేసిన విషయం తెల్సిందే.
అక్టోబర్ 10వ తేదీ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మా ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి.