వేలాది మంది కష్టాన్ని ఒక్కడే దోచుకున్నాడంటూ సినిమా పైరసీకి అడ్డాగా నిలిచిన 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరగాళ్ళను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమకు కంటిమీద కునుకులేకుండా చేసిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో చిత్రపరిశ్రమ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేశ్ బాబు, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, పైరసీ వల్ల చిత్రపరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టనష్టాలకోర్చి సినిమాలు తీస్తుంటే రవి లాంటివాళ్ళు వేలాది సినీ కుటుంబాల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొన్ని వేల మంది కష్టాన్ని ఒక్కడు దోచుకోవడం సరికాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు అని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇపుడు సజ్జనార్ పైరసీపై సాగుతున్న యుద్ధంలో అండగా నిలిచారని చిరంజీవి ప్రశంసించారు.
రెండు రోజుల క్రితం 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయగా, ఆయన నుంచి వెబ్సైట్ లాగిన్ వివరాలు సేకరించి ఆ వెబ్సైట్ను పూర్తిగా బ్లాక్ చేయించారు. అలాగే, రవి బ్యాంకు నుంచి రూ.3 కోట్ల నగదును సీజ్ చేశారు. వందలాది హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రవిని జైలుకు తరలించారు.