కోట్ల రూపాయలతో సినిమాలను తెరకెక్కించి అలా విడుదల చేస్తారో లేదో ఇలా పైరసీని పుట్టించేస్తాడు ఐ బొమ్మ ఇమ్మడి రవి. ఇతడి క్రిమినల్ స్టోరీ గురించి హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాపట్టణం జిల్లాలోని సాలిపేట గ్రామంలో ఓ సామాన్యకుటుంబంలో పుట్టిన ఇమ్మడి రవి చదువులో చురుకైన విద్యార్థి. ఐటీ ఫీల్డులో ఆసక్తితో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రవి ఆ తర్వాత రెండు కంపెనీలకు సీఈఓ స్థాయి దాకా వెళ్లాడు.
ఐతే పెళ్లాడిన భార్యతో విభేదాలు రావడంతో ఆమె నుంచి విడిపోయిన రవి, ఆ తర్వాత ఒంటరిగా వుంటూ వస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్సుతో పాటు పాన్ కార్డ్ కూడా సాధించాడు. ఇక అక్కడ నుంచి ఇతడి నేర సామ్రాజ్యం ప్రారంభమైంది. 2019లో ఐ బొమ్మ అనే పైరసీ సైటును ప్రారంభించడమే కాకుండా ఏకంగా 110 డొమైన్లను కొనుగోలు చేసాడు.
చిత్రాన్ని పైరసీ సైట్లలో పెట్టినప్పుడు బ్లాక్ చేస్తే మరో వెబ్ సైట్ ద్వారా దాన్ని వదిలేవాడు. ఫ్రాన్స్, కరేబియన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కెనడా, దుబాయ్.. ఇలా అనేక దేశాలు తిరుగుతూ పోలీసులకే సవాల్ విసిరాడు. తనను పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరిన ఇమ్మాడి రవిని పోలీసులు వలపన్ని పట్టేసారు. కాగా ఇతడి వెనుక ఇంకెవరున్నారని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపి సజ్జనార్ వెల్లడించారు.