పైరసీ సినిమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేతులతోనే వాటిని మూసివేయించారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేశారు.
'నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి' అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ సవాల్‌కు సంబందించిన ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సవాల్‌ను స్వీకరించిన పోలీసులు అతని కోసం వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆ సవాల్‌ను స్వీకరించి ఇమ్మడి రవితోనే పోలీసులు ఆయా వెబ్‌సైట్లను క్లోజ్ చేయించడం గమనార్హం.
ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు.